చేతిలో అధికారం ఉన్న అధినేతకు ఒళ్లు మండితే.. దాని ఫలితం ప్రజల కంటే కూడా ఆయన చుట్టూ ఉన్న విధేయుల మీద పడటం ఖాయం. అందుకు భిన్నంగా వేటు పడిన రోజుల వ్యవధిలోనే వరాలు పొందటం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. తాజాగా ఆయనకు ప్రభుత్వంలో సేవల్ని అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఈ నెల 19న వైఎస్ జగన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో విజయసాయికి అప్పటికే ఉన్న అధికారాలకు కోత పెట్టేసి.. ఆయన తోక కత్తించినట్లుగా వార్తలు వచ్చాయి. కీలక బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త బాధ్యతల్ని విజయసాయి నిర్వహించారు.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పలు బాధ్యతలను కొత్త వారికి అప్పగించిన నేపథ్యంలో విజయసాయిని ఆ బాధ్యత నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డికి అప్పజెప్పారు. ఇటీవల కాలంలో విజయసాయి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శల తీవ్రతను తగ్గించేందుకు విజయసాయి జోరుకు కళ్లాలు వేసినట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ.. ఆ వాదనల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని తాజాగా సీఎం జగన్ స్పష్టం చేశారని చెప్పాలి. తాజాగా ఆయనకు పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు రీజినల్ కో ఆర్ఢినేటర్లు.. పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతను అప్పజెప్పటం చూస్తే.. మొన్నటికి ఇప్పటికి ఎంతలో ఎంత తేడా అనుకోకుండా ఉండలేం. ఇటీవల కాలంలో విజయసాయికి కొన్ని సందర్భాల్లో అత్యధిక ప్రాధాన్యం.. మరికొన్ని సందర్భాల్లో పుల్లను తీసి పారేసినట్లుగా పక్కన పెట్టేయటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. కానీ.. తనకు ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ స్వల్ప వ్యవధిలోనే దాన్ని అధిగమిస్తున్న విజయాసాయి తెలివికి ఫిదా కావాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates