తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధి అలంపూర్ నుంచి ప్రారంభమైంది.
31 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 29 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బండి సంజయ్ పర్యటిస్తారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.
ఎండలు విపరీతంగా ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కాస్త విరామం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలకు బండి స్వయంగా వెల్లడించినట్టు తెలిసింది. ఇటీవల జోగులాంబ వద్ద.. టీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాత్రకు బ్రేక్ పడుతుందని అనుకున్నా.. అలా జరగలేదు. వాస్తవానికి పాదయాత్రలో ఉన్న బండి సంజయ్.. రెండు రోజులుగా అస్వస్ధతకు గురైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
12 రోజులుగా ఎండల్లో పాదయాత్ర చేస్తున్నందున ఆయన కొంత నీరసపడ్డారని అంటున్నారు. రెండురోజులపాటు రెస్ట్ తీసుకోవాల ని వైద్యులు సూచించినట్టు సమాచారం. అయినప్పటికీ షెడ్యుల్ ప్రకారం పాదయాత్ర చేస్తానని బండి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అయితే.. సోమవారం ఉదయం వైద్యులు.. బండికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సోడియం, పోటాషియం లెవల్స్‌లో తేడాను వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బండి తన పాదయాత్రను రెండు రోజుల పాటు విరమించుకునేందుకు నిర్ణయిం చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తెలియాల్సి ఉంది.