కాంగ్రెస్ నేత‌ల‌ను చేర్చుకోండి… కేసీఆర్‌కు పీకే స‌ల‌హా?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఎంట్రీ ఇవ్వ‌డంతో మొద‌లు ట్విస్టుల మీద ట్విస్టులు కొన‌సాగిస్తున్న అన‌లిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ ఆ ఒర‌వ‌డిని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నార‌ని అంటున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సోనియా, రాహుల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్తలు వచ్చిన టైంలోనే ఆయన టీఆర్‌ఎస్‌ అధినేతతో భేటీ అవ‌డం రెండు పార్టీల‌కు పెద్ద షాకింగ్ న్యూస్ అనే సంగ‌తి తెలిసిందే.

అయితే, తాను కాంగ్రెస్‌లో చేరినా తన టీం (ఐప్యాక్‌) టీఆర్‌ఎస్‌కు పనిచేస్తుందని పీకే చెప్పినట్టుగా ప్రగతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ స‌మ‌యంలోనే పెద్ద ట్విస్టు ఉంద‌ని అంటున్నారు. పీకే త‌న సేవ‌లు అందించ‌డంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు కీల‌క ప్ర‌తిపాద‌న చేశార‌ని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తాజా రిపోర్టులోనూ పీకే తేల్చి చెప్పినట్టు స‌మాచారం.

వారి స్థానంలో అక్కడ ఎవరు క్యాండిడేట్‌ అయితే బెటర్‌ అనే కోణంలోనూ సర్వే చేసి ఆ రిపోర్టు కూడా కేసీఆర్‌కు ఇచ్చినట్టు సమాచారం. పీకే ప్రతిపాదించిన ఆల్టర్నేట్‌ క్యాండిడేట్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాళ్ల పేర్లు సైతం ఉన్నాయనే ప్రచారం రెండు పార్టీల నేతల్లో గందరగోళం సృష్టిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని చెప్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుపొంది హ్యాట్రిక్ విజ‌యం సాధించాల‌ని తెల‌గాణ సీఎం కేసీఆర్ కంక‌ణ‌బ‌ద్దులై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వివాదాస్ప‌దులైనా , తిరిగి గెలుపొందలేర‌నే అనుమానం ఉన్న ఎమ్మెల్యేల విష‌యంలో సీఎం కేసీఆర్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు పీకే చేసిన సూచ‌న‌తో కాంగ్రెస్ నేత‌ల‌కు వెల్‌కం చెప్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌నే ఆందోళ‌న కొంద‌రు సిటింగ్ ఎమ్మెల్యేల్లో మొద‌లైంద‌ని అంటున్నారు.