మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే.. రాజకీయంగా ఆమె సాధించింది పెద్దగా లేదని స్థానికులే చెబుతున్నారు.
గట్టి వాయిస్ లేదు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నప్పటికీ.. పార్లమెంటులో బలమైన గళం కూడా వినిపించలేదని చెబుతున్నారు. స్థానికంగా అరకులో 1/70 చట్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తీ సేయాలనేది ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మాట. అదేసమయంలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇక, ప్రసూతి వచ్చినా.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా.. నియోజకవర్గం నుంచి విశాఖ వస్తే.. తప్ప మెరుగైన వైద్య అందే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో అరకులోనే మెరుగైన సౌకర్యాలతో వైద్య శాలను ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అయితే.. ఇవన్నీ.. చేస్తామని.. తనను గెలిపించాలని.. మాధవి హామీ ఇచ్చారు. అయితే.. దీనిని ఆమె మరిచిపోయారు. తన వివాహం పేరుతో ఏడాది పాటు ప్రజలకు దూరంగా ఉన్నారని..ఇక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత.. కరోనాపేరుతో అసలు కంటికి కూడా కనిపించలేదు. ఇక, ఇటీవల కాలంలో కరోనా తగ్గినా.. వ్యక్తిగత సమస్యలతో ఆమె గడప దాటి బయటకు రావడం లేదు.
ఈ పరిణామాలతో ఎంపీపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. అయితే.. ఆమెపై వ్యతిరేకత లేకపోయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే వాదన మాత్రంబలంగా వినిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో అయినా.. తమకు చేరువగా ఉండాలని… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఎంపీగారు.. ప్రజల మాట వింటారా.. లేదా.. చూడాలి. ఇక్కడ ఆమెకు కలిసి వస్తున్న అంశం ఏంటంటే.. ప్రతిపక్షం బలంగా లేక పోవడమే!!
Gulte Telugu Telugu Political and Movie News Updates