ఈ సారి మ‌హానాడు వేదిక ఆ జిల్లానే: చంద్ర‌బాబు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఏర్ప‌డిన టీడీపీ ఏటా మేనెల‌లో మ‌హానాడు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మాలు.. భూత, భ‌విష్య‌త్ వ‌ర్త‌మానాల‌కు సంబంధించిన అంశాల‌పై ఈ వేదిక‌గా చ‌ర్చించి.. పార్టీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా పార్టీ అభిమానులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతుంటారు. గ‌త రెండేళ్లుగా క‌రోనా నేప‌థ్యంలో మ‌హానాడును సాదాసీదాగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

పార్టీ అధికారంలో ఉన్న సమ‌యంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన మ‌హానాడును ఈ ద‌ఫా.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో నిర్వ‌హించాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. పార్టీకి కంచుకోట వంటి ప్ర‌కాశం జిల్లాలో ఈ ద‌ఫా తొలిసారి ఇక్క‌డ మ‌హానాడు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ త‌ర‌ఫున ప్ర‌తి ఒక్క‌రూ హాజ‌ర‌య్యేలా ఆహ్వానాలు పంప‌నున్నారు. అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న మ‌హానాడు కావ‌డంతో గ‌ట్టిగా ప్రిపేర్ అయి రావాల‌ని కూడా నాయ‌కుల‌కు సూచించిన‌ట్టు తెలిసిందే. తాజాగా పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడారు.

ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదన్నారు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు…పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరని ఆయ‌న వ్యాఖ్యానించారు. టిడిపి అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీ ప్రజలు గుర్తించారు…తాము ఏం నష్టపోయామో వారికి తెలుస్తోంద‌ని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు…జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు.

ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. మద్యంపై బహిరంగ దోపిడీ జరుగుతోంద‌ని …ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతోంద‌ని వ్యాఖ్యానించారు. మైనింగ్, ఇసుక ను సంపూర్ణంగా దోచుకుంటున్నారని, ఈ భారం ప్రజపైనే పడుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసిపికి పడే చాన్స్ లేదని తేల్చి చెప్పారు. రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి… ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు….కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదన్నారు.

పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టీడీపీపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారని చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్ లో అపరిచితుడు ఉన్నాడు….జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదని అన్నారు. వైసిపి ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదనే కార‌ణ‌మే.. జగన్ ఫ్రస్టేషన్ కు కారణమ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారి పీకుతా అనే మాట‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. క్యాబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయిందని అన్నారు. ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారు…..దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయని చెప్పారు.

క్యాబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ రాలేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. భవనం వెంకట్రామ్ కు కూడా ఇంత బలహీనంగా కనిపించలేదన్నారు. నా ఇంటి మీద దాడికి వచ్చిన వారికి….లోకేష్ ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని విమ‌ర్శించారు. మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత అని ప్ర‌శ్నించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటంలోను పాల్గొంటాన‌ని చెప్పారు. మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుందని, మే మొదటి వారం నుంచి ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతానని చంద్ర‌బాబు తెలిపారు. నెలకు రెండు  జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానన్నారు. ఈ ఏడాది ఒంగోలు లో మహానాడు నిర్వహిస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.