ఏపీ రెడ్లు కుత‌కుతా… ప‌ద‌వుల కోసం కాద‌ట‌..!

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డ‌డంలోనూ, వైసీపీ అధినేత‌గా ఉన్న ఆయ‌న‌ను ముఖ్యమంత్రి చేయ‌డంలోనూ.. రెడ్డి సామాజిక వ‌ర్గం పాత్ర‌ను ఎవ‌రూ విస్మ‌రించ‌లేరు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని.. 2016 నుంచే వైసీపీలోని రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కులు కోరుకున్నారు. చంద్ర‌బాబు పాల‌నలో త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని.. క‌నీసం.. ప‌రిశ్ర‌మ‌ల‌ను.. వ్యాపారాల‌ను కూడా నిర్వ‌హించ‌లేక పోతున్నామ‌ని.. జ‌గ‌న్ సీఎం అయితే.. కొంత‌మేర‌కు త‌మ‌కు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. అందుకే జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు ఆర్థికంగా, సామాజిక ప‌రంగా.. భౌతికంగా కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు.

అనుకున్న‌ది సాధించారు. భారీ మెజారిటీతో జ‌గ‌న్ సీఎం అయ్యేలా రెడ్డి వ‌ర్గం ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయింది. అయితే.. ఇప్ప‌టికి జ‌గ‌న్ పాల‌న‌లో మూడేళ్లు గ‌డిచిపోయాయి. ఈ క్ర‌మంలో గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌పై ఇప్పుడు రెడ్డి వ‌ర్గం స‌మీక్షించుకుంటే.. పెద‌వి విరుపులు త‌ప్ప వారికి ఏమీ క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. త‌మ‌కు ఏం ఒర‌గ‌బెట్టార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మేం ఏదో ఆశించాం. కానీ.. ఏమీ జ‌ర‌గ‌డం లేదు అని అన్ని జిల్లాల్లోని రెడ్డి వ‌ర్గం నాయ‌కులు అంటున్నారు. అంతేకాదు.. ఈమూడేళ్ల కాలంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా వారు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

మేం పారిశ్రామికంగా క‌రోనా టైంలో న‌ష్ట‌పోయాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పులు చేసి పార్టీ నాయ‌కుల‌ను ప్రోత్స‌హించాం. క‌రోనా న‌ష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో మాపై మ‌రింత భారం ప‌డింది. రెడ్డి ప్ర‌భుత్వం ఉంద‌ని.. సంతోషించాలో.. లేక ఆవేద‌న చెందాలో అర్ధం కావ‌డం లేదు అని గుంటూరు జిల్లాకు చెందిన ఒక రెడ్డి నాయ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. కాంట్రాక్టులు కూడా త‌మ‌కు చిక్క‌డం లేద‌ని.. నిబంధ‌న‌ల పేరుతో తాము ఇబ్బంది ప‌డుతున్నామ‌ని అంటున్నారు.

ఇక‌, గ‌తంలో ప‌నులు చేసిన వారికి బిల్లులు నిలిపివేయ‌డం కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంలో తీవ్ర అసంతృప్తిని ర‌గుల్చుతోంది. ఇందుకా మేం.. క‌ష్ట‌ప‌డింది! అని ఓ నాయ‌కుడు.. తీవ్ర‌స్తాయిలో త‌మ వ‌ర్గంలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ ఈ ప‌రిణామాల‌పై దృష్టి పెట్ట‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.