ఏపీలో కొత్తగా కొలువు దీరిన మంత్రివర్గంలో ఒక్కొక్క మంత్రి తమ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ముహూర్తం .. వర్జ్యం.. ఇలా అన్నీ చూసుకుని తమ తమ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే.. ఇలా బాధ్యతలు తీసుకుంటున్నవారు..తమ మనసులో ఉన్న మాటలను దాచుకోలేక పోతున్నారు. వెంటనే బయట పెట్టేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటారో..అనే బాధ కూడా లేకుండా.. ఎలాంటి మొహమాటానికీ తావివ్వని విధంగా.. సీఎం జగన్‌కు భజన చేస్తున్నారు. నిన్నటికి నిన్న సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన.. చెల్లుబోయిన వేణు.. సీఎం జగన్‌ను ఆరాతీయకండి.. ఆరాధించండి.. అప్పుడు అందరిపనులు నెరవేరుతాయని.. స్వామి భక్తి ప్రదర్శించారు.
ఇక, ఇప్పుడు తాజాగా.. సీనియర్ నేత, జగన్ 2.0లో మంత్రిగా అవకాశం చిక్కించుకున్న ధర్మాన ప్రసాద్ రావు కూడా రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కూడా నోరు జారిపోయారు. తనకంటూ.. ఎలాంటి లక్ష్యాలు లేవని.. తూచ. తప్పకుండా.. జగన్ చెప్పింది చేయడమే.. తన డ్యూటీ అని చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికే విపక్షాలు.. ఎంత మంది మంత్రులున్నా.. ఎన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినా.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని.. విమర్శలు గుపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మాన వ్యాఖ్యలు ప్రాధాన్యం దక్కించుకున్నాయి.
గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. అయినప్పటికీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవని ధర్మాన అన్నారు. సీఎం జగన్ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. “రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని” మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates