పాత ఎవ‌రు కొత్త ఎవ‌రు.. అంతా ఒక్క‌టే బాస్ ?

పాత నీరు పోతుంది అని అనుకోకండి..కొత్త నీరు వ‌స్తుంది అని సంబ‌ర‌ప‌డిపోవ‌ద్దు. రెండింటి మేలు క‌ల‌యికే కొత్త క్యాబినెట్ అని అంటున్నారు జ‌గ‌న్ 2.0 ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. ఆయ‌న చెబుతున్న ప్ర‌కారం పాత కొత్త‌లు క‌లుస్తారు. క‌లిసి ప‌నిచేస్తారు. ఇంకొంద‌రు సీనియ‌ర్లు జిల్లాల‌కు పోయి పార్టీ ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తారు. ఆ విధంగా పార్టీనీ, ప్ర‌భుత్వాన్నీ ఏక కాలంలో ప్ర‌క్షాళ‌న చేశామ‌న్న భావ‌న ఒక‌టి ఇవాళ సీఎం జ‌గ‌న్ లో స్థిర‌ప‌డ‌నుంది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులూ వాటితో కూడిన కూర్పులు చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రంకు ఒక నిర్ణ‌యం వ‌స్తుంది.
అటుపై సీఎం స్వ‌యంగా కాల్ చేసి కొత్త మంత్రుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పి బాగా ప‌నిచేయాల‌ని ఆకాంక్షిస్తూ నాలుగు మంచి మాట‌లు చెప్ప‌నున్నారు. కాల్ రాక‌పోతే పోస్టు లేన‌ట్లే! ఇది ఫిక్స్ భ‌య్యా! ఇక గ‌త మంత్రి వ‌ర్గం నుంచి వివాదాలు ఎదుర్కొన్న బూతుల మంత్రి కొడాలి నాని మ‌ళ్లీ వ‌స్తున్నాడు. ఇప్పుడిదే భ‌యం తెలుగుదేశం పార్టీకి ప‌ట్టుకుంది. గ‌తం క‌న్నా వేగంగా ప‌నిచేసి టీడీపీని తాను నిలువ‌రిస్తాన‌ని ఇప్ప‌టికే చెప్పారాయ‌న అని తెలుస్తోంది.

ప‌దవి ఉంటేనే త‌న‌కు అడ్డు అని లేదంటే విశ్వ‌రూపం చూపిస్తాన‌ని మొన్న కూడా అన్నారు. అంటే అన్నారు కానీ పౌర స‌ర‌ఫ‌రాలే మ‌ళ్లీ ఆయ‌న‌కు ఇస్తారా? ఇస్తే బియ్యం లెక్క‌లు మ‌ళ్లీ ఏమౌతాయో ! అన్న భ‌యం ఒక‌టి వినిపిస్తుంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ  మంత్రులు ఎవ్వ‌ర‌యినా అధికార‌వం జ‌గ‌న్ దే. కానీ కాకినాడ కేంద్రంగా ఓడ‌రేవు దాటిపోతున్న బియ్యం లెక్క మాత్రం గౌర‌వ ముఖ్య‌మంత్రి తేల్చ‌లేక‌పోతున్నారు. నాటు సారా ప్ర‌వాహాల‌ను నిలువ‌రించ‌లేక‌పోతున్నారు. గంజాయి ర‌వాణాను అడ్డుకోలేక‌పోతున్నారు. అధికారం అంతా ఆయ‌న‌దే క‌దా మ‌రి నేనుండి ఏం చేయాలి అని గ‌తంలో బొత్స అరిచాడు.

కానీ ఆ అరుపును ప‌ట్టించుకోలేదు. ఆ ముగ్గురు రెడ్ల‌దేనా రాజ్యం అని కూడా అరిచాడు అయినా ప‌ట్టించుకోలేదు. క‌నుక కొత్త‌వారు వ‌చ్చినా, పాత వారు కొన‌సాగినా జ‌గ‌న్ క్యాబినెట్ లో చేయ‌డానికి పనేం ఉండ‌దు. హాయిగా నాలుగు శంకుస్థాప‌న‌లు
3 ప్రారంభోత్స‌వాల‌తో కాలం నెట్టుకు రావ‌డ‌మే. ఏ ఫైల్ కూడా సొంతంగా త‌యారు చేయడానికి కానీ ఏ ప‌ని కూడా సొంత నిర్ణ‌యంతో చేయ‌డానికి కానీ వీల్లేని స్థితిలో ఇప్ప‌టిదాకా ప‌నిచేసిన మంత్రులు ఉన్నారు. ఇక‌పై కూడా ఇదే సీన్. క‌నుక బొత్స కు మ‌ళ్లీ త‌లనొప్పులు త‌ప్ప‌వు.