రామాయణ ట్రైలర్… వర్త్ ఉందా వర్మా

నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట ఎక్కువగా హైలైట్ చేయకపోయినా ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించడం ఒక ఆకర్షణ అయితే రావణుడిగా యష్ చేయడం హైప్ ని మరింత పెంచింది. గతంలో టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ట్రైలర్ కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూశాయి. ఆ లాంఛనం పూర్తి చేశారు.

నాలుగు నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్న రామాయణ ట్రైలర్ లో అందరికీ తెలిసిందే కాబట్టి కథ ఏముంటుందనే సస్పెన్స్ ఎవరికీ లేదు. కథనాన్ని ఎలా హ్యాండిల్ చేశారనే దాని గురించే అందరూ వెయిట్ చేశారు. రావణుడి పరిచయం, రాముడి వనవాసం, సీత దర్శనం, అడవిలో శూర్పణఖకు అవమానం, రావణ ప్రతిజ్ఞ తదితర ఘట్టాలన్నీ ఇందులో పొందుపరిచారు. విఎఫెక్స్ కు పెద్ద పీఠ వేయడంతో ఆర్గానిక్ లుక్ తగ్గిన మాట వాస్తవం. హంగులు ఆర్భాటాలు ఎక్కువగా కనిపించాయి.

ఇది ఇంకా శాంపిల్ కాబట్టి అప్పుడే అసలు సినిమా గురించి పూర్తి అంచనాకు రాలేం కానీ సోషల్ మీడియాలో అయితే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రామాయణ ఎమోషన్ ని ఒడిసిపట్టుకోవడంలో దర్శకుడు నితేశ్ తివారి తడబడినట్టుగా ఉందని, గ్రాఫిక్స్ డామినేషన్ వల్ల ఆ ఫీల్ తగ్గిందనే అభిప్రాయం వ్యక్థమవుతోంది. ఇంకోవైపు భారతదేశపు అతి గొప్ప ఇతిహాసాన్ని ఈ స్థాయిలో ప్రెజెంట్ చేసిన తొలి చిత్రంగా రామాయణ నిలిచిపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే వర్త్ వర్మా వర్త్ అని సంపూర్ణంగా అనిపించుకోవడంలో ట్రైలర్ కాస్త ముందు వెనుకా ఊగిందని చెప్పాలి. విడుదల తేదీ నవంబర్ 8 అని ప్రచారంలో ఉన్నప్పటికీ ట్రైలర్ లో డేట్ పొందుపరచకపోవడం గమనార్హం. దీపావళి రిలీజ్ అని మాత్రమే పేర్కొన్నారు. లుక్స్ పరంగా రన్బీర్ కపూర్ మంచి ఛాయసే అనిపిస్తున్నాడు. సీతగా సాయిపల్లవి ఒదిగిపోయే ప్రయత్నం చేసింది. యష్ నిరాశపరిచేలా లేడు. రెహమాన్ – హ్యాన్స్ జిమ్మెర్ సంగీతం ఎలివేషన్ కు దోహదపడింది.