రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం, పార్టీ అధిష్టానం అండతోనే ముఖ్యమంత్రి పీఠం దక్కిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను రాజీనామా చేయాలని కోరే హక్కు, ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఏదైనా ఉంటే తనను నేరుగా వచ్చి అడగాలని ఆయన సవాల్ రువ్వారు. బీఆర్ఎస్ నాయకులకు అసలు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని సీఎం వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పేపర్ లీకైందని.. దీనికి బాధ్యత వహిస్తూ.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, బీఆర్ ఎస్ నేతలు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం.. తనను అలా అడిగే ముందు వారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని అన్నారు. గతంలో బీఆర్ ఎస్ హయాంలో ఎన్ని లీకులు జరిగాయో చిట్టా విప్పాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలపరిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యావ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి.. విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో పర్యటించి వచ్చిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనపై కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయితే.. ఎక్కి కూర్చునేందుకు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ, వారికి 2034 వరకు ఈ సీటు ఖాళీ కాదని మరో చెబుతున్నానన్నారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పస్టం చేశారు. బీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఆకలితో ఉండకూడదనే అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించామన్నారు. కే. కేశవరావు ను సలహాదారుగా నియమించి.. ఆయన సూచనలను పాటిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన వారు. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ.. బీఆర్ ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
