ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడటం మాములు విషయం. ప్రేమాభిషేకం, అడవి రాముడు ఏడాది పాటు థియేటర్ల నుంచి కదల్లేదు. సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటివి సిల్వర్ జూబ్లీ వరకు హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. సింహాద్రి, ఖుషి, ఒక్కడు, కలిసుందాం రా రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రేమికుడు లాంటి డబ్బింగ్ చిత్రాలు సైతం శతదినోత్సవ షీల్డులు ఇచ్చిన ట్రాక్ రికార్డు టాలీవుడ్ సొంతం. ఇదంతా గడిచిపోయిన గతం.
ఈ ట్రెండ్ ఎప్పుడో అంతరించి పోయింది. ఇంటర్ నెట్, 5జి, ఓటిటి, స్మార్ట్ టీవీలు వచ్చాక లాంగ్ రన్ కలగా మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప., కెజిఎఫ్ లాంటి అల్ టైం హిట్స్ ఏవీ వంద రోజులు ఆడలేదు. త్వరగా వేల కోట్లు పోగేసుకుని వెళ్లిపోయాయి. కానీ జనవరిలో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు కడప జిల్లాలోని ఎర్రగుంట్ల అనే చిన్న ఊరిలో ఆరు నెలలకు పైగా ఆడుతూనే ఉండటం విడ్డూరమనిపించినా ఇది నిజం. ప్రకటన కూడా వచ్చింది.
నిజంగా 200 రోజులు డైలీ నాలుగు ఆటలు చొప్పున అన్నీ ఆడించారా అంటే ఫ్యాన్స్ ఔననే అంటున్నారు. గతంలో లెజెండ్, మగధీర, పోకిరి లాంటివి సంవత్సరం పాటు ఆడించారు. కానీ వాటిలో జనం లేకుండా ఆపేసిన షోలు చాలా ఉన్నాయని యాంటీ ఫ్యాన్స్ పరస్పరం కామెంట్స్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన శంకరవరప్రసాద్ గారు ఈ ఫీట్ సాధించడం చూస్తుంటే రికార్డు కోసం రన్ చేశారా లేక నిజంగా కలెక్షన్ వచ్చిందా అంటే, ఏమో సమాధానం చెప్పలేం.
ఒకవేళ వాస్తవమే అయితే సంతోషించాల్సిన పరిణామమే. ఎందుకంటే ఓటిటిలో వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా 200 రోజులు థియేటర్లో ఉందంటే ఊహకందని రికార్డు. ఆ మధ్య వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిని పోటాపోటీగా ఒక కేంద్రలో హండ్రెడ్ డేస్ ఆడించిన సంఘటన అప్పుడప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడీ వరప్రసాద్ ఫీట్ ని మళ్ళీ ఎవరితో దాటిస్తారో దానికి ఏ ఊరి థియేటర్ వేదికగా మారుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
