బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కొంప ముంచిందిగా జ‌గ‌న్ స‌ర్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారో.. ఆ ల‌క్ష్యం నెర‌వేర‌కుండానే వెనుదిరిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి కార‌ణం ఆయ‌న చేసిన బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌నేన‌ని తెలుస్తోంది. వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ అక్క‌డ‌కు వెళ్లారు. అయితే.. ములాఖ‌త్ స‌మ‌యం మించిపోవ‌డంతో పోలీసులు ఆయ‌న‌ను ఎంట‌ర్ కాకుండానే వెన‌క్కి వెళ్లిపోవాల‌ని తేల్చి చెప్పారు.

సీదిరి అప్ప‌ల‌రాజు కుమారుడు ఆర‌వ్ వ‌ర్మ చేసిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ గొర్రెల కాప‌రి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అయితే.. ఈ కేసు నుంచి త‌న కుమారుడిని త‌ప్పించేందుకు అమాయ‌కుడైన ఆర‌వ్ స్నేహితుడిని ఇరికించారు. అదేస‌మ‌యంలో త‌మ‌పై కేసు పెట్ట‌కుండా ఉండేందుకు మృతుడి కుటుంబానికి సొమ్ములు ఇవ్వ‌జూపారు. కానీ, ఈ విష‌యాలు మీడియాలో తేట‌తెల్లం అయ్యే స‌రికి.. సీదిరి అడ్డంగా బుక్క‌య్యారు. దీంతో అటు కుమారుడిపై ప్ర‌మాదం కేసుతోపాటు.. సీదిరిపై మోసం కేసు న‌మోదైంది.

దీంతో అప్పలరాజు ప్ర‌స్తుతం జైల్లోనే ఉన్నారు. అయితే.. సీదిరిపై అక్ర‌మ కేసులు పెట్టారంటూ ఆరోపిస్తున్న జ‌గ‌న్‌.. ఆయ‌న‌ను పరామ‌ర్శించేందుకు గురువారం వెళ్లారు. అయితే.. విమానాశ్ర‌యం నుంచే పెద్ద ఎత్తున ర్యాలీగా బ‌య‌లు దేరడం.. వాహ‌నం ఫుట్ బోర్డుపై నిల‌బ‌డి .. దారి పొడ‌వునా అంద‌రికీ అభివాదం చేస్తూ.. మ‌ధ్య‌మ‌ధ్య ఆగుతూ వెళ్ల‌డంతో చివ‌ర‌కు జైలుకు చేరుకునే స‌రికి స‌మ‌యం గ‌డిచిపోయింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం సాయంత్రం 5 దాటితే ఎవ‌రినీ క‌లుసుకోనివ్వ‌రు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు జైలు అధికారులు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. అయిన‌ప్పటికీ.. ఒకే ఒక్క నిమిషం అనుమ‌తించాల‌ని కోరారు. కానీ, నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని.. జైలులోకి అనుమ‌తించేది లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. దీంతో జ‌గ‌న్ వెనుదిరిగి పోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. ఆదివారం వ‌ర‌కు ములాఖ‌త్‌లు లేవ‌ని అధికారులు తెలిపారు. మొత్తంగా.. తాను బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగ‌కుండా ఉంటే.. స‌మ‌యానికి సీదిరితో ములాఖ‌త్ జ‌రిగి ఉండేది. కానీ, జ‌గ‌న్ మాత్రం వెళ్లిన కార్యం ఒక‌టైతే.. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇచ్చారు.