తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ స్థాయిలో ఉండేవి. ఆయన సినిమాలకు పోటీనే ఉండేది కాదు. రజినీ ఫ్లాప్ సినిమాల కలెక్షన్లను వేరే స్టార్ల హిట్ సినిమాలు దాటలేకపోయేవి. అలాంటి హీరోను విజయ్ అధిగమించి తమిళంలో నంబర్ వన్ హీరో కావడం అసామాన్య విషయం. గత దశాబ్ద కాలంలో విజయ్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. అదే సమయంలో రజినీ డౌన్ అయ్యాడు.
లియో, వారిసు, ది గోట్ లాంటి సాధారణ చిత్రాలతో కూడా భారీ వసూళ్లు రాబట్టడం విజయ్‌కే చెల్లింది. ఇప్పుడు తన చివరి చిత్రం ‘జననాయగన్’తోనూ అతను అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు తొలి రోజు ఎంత బ్యాడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. అయినా సరే.. ఈ సినిమా తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించింది. వీక్ డేస్‌లో కూడా వసూళ్లు పర్వాలేదు. ఇతర భాషల్లో ప్రభావం చూపకపోయినా.. తమిళంలో మాత్రం ‘జననాయకుడు’కు ఢోకా లేదు.
ఇప్పటికే ‘జననాయగన్’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.250 కోట్ల మార్కుకు చేరువగా ఉండడం విశేషం. ఈ వీకెండ్లో కూడా తమిళంలో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. కాబట్టి ఈ సినిమా రన్ ఇంకొన్ని రోజులు కొనసాగేలా ఉంది. కాబట్టి ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. విశేషం ఏంటంటే.. తమిళంలో విజయ్‌కు చాలా ఏళ్లు సమవుజ్జీగా ఉన్న అజిత్.. గత ఏడాది తన బ్లాక్ బస్టర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో సాధించిన వసూళ్లు రూ.250 కోట్ల లోపే.
అలాంటి సినిమాను డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రంతో విజయ్ దాటేస్తున్నాడు. విజయ్ మార్కెట్ స్టామినా ఎలాంటిది అనడానికి ఇదే రుజువు. కానీ ఇలాంటి తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కెరీర్ పతాక స్థాయిలో ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పేయడమే అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. కానీ అదే సమయంలో ఆయన రాజకీయాల్లో సూపర్ హిట్ అయి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వారికి మరో రకంగా సంతోషాన్నిస్తోంది. ‘భగవంత్ కేసరి’ నుంచి మెయిన్ ప్లాట్ తీసుకుని మార్పులు చేర్పులతో హెచ్.వినోద్ రూపొందించిన ‘జననాయగన్’ను వెంకట్.కె.నారాయణ నిర్మించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
