బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును జైల్లో పెట్ట‌డానికి చంద్ర‌బాబు కుట్ర చేశార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీదిరి అంటే ఆయ‌న‌కు ప‌డ‌ద‌ని కూడా అన్నారు. కుట్ర‌లు చేసి సీదిరి కుటుంబాన్ని వేధిస్తున్నార‌ని ఆరోపించారు. అయితే.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా.. ఈ కేసులో కుట్ర‌లు ఉన్నాయా? నిజానికి దీనిలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉందా?.. నిజంగానే ఆయ‌న‌ను కావాల‌నే ఇరికించారా? అనేది ప్ర‌శ్న‌.

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం.. ఎలాంటి కుట్ర‌లు లేవు. పైగా.. సీదిరి చేసుకున్న అతి తెలివి తేట‌ల ప‌నులే ఆయ‌న‌ను అడ్డంగా ఇరికించాయ‌న్న‌ది వాస్త‌వం. కానీ.. దీనిని దాచి పెట్టి జ‌గ‌న్‌.. ఎదురు దాడి చేస్తుండడం గ‌మ‌నార్హం అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. బుల్లెట్‌తో రోడ్డు ప్ర‌మాదం చేసి.. ఓ వ్య‌క్తికి మృతికి కార‌ణ‌మైన త‌న కుమారుడు ఆర‌వ్‌ను బ‌య‌ట ప‌డేసే క్ర‌మంలో వేరే యువ‌కుడిని ఈ కేసు ఒప్పుకొనేలా చేసి.. బైకు ప్ర‌మాదం అత‌డే చేశాడ‌ని పోలీసుల‌ను కూడా మ‌భ్య పెట్టి సీదిరి ఓ కేసు న‌మోదు చేయించారు.

దీంతో సీదిరి మాట‌లు విని.. ఆయ‌న చెప్పింది నిజ‌మేన‌ని నమ్మిన పోలీసులు.. ఆయ‌న చెప్పిన‌ట్టుగా ఆర‌వ్ స్నేహితుడు, బుల్లెట్ ఓన‌ర్ కుమారుడిపై పోలీసులు కేసు పెట్టారు. అనంత‌రం.. ఈ వ్య‌వ‌హారం మీడియాలో వెలుగు చూసింది. మ‌రోవైపు.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా న‌డిరోడ్డుపై ప్ర‌మాదానికి గురైన గొర్రెల కాప‌రికి సీపీఆర్ చేసింది సీదిరి కాదు. దారిన పోతున్న ఓ వ్య‌క్తి. ఈ విష‌యాన్ని కూడా పోలీసులు న‌మోదు చేశారు. ఇక‌, సీదిరి చెప్పిన‌ట్టు అక్ర‌మ కేసు పెట్టినందుకు సీఐ, ఎస్సై స‌హా.. ప‌లువురు పోలీసుల‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. వారిపై విచార‌ణ జ‌రుగుతోంది.

ఇక‌, సామాన్య గొర్రెల కాప‌రి.. ఈ ప్ర‌మాదంలో ముఖ్యంగా ఆర‌వ్ చేతిలో మృతి చెందిన వ్య‌క్తి తాలూకు కుటుంబం రోడ్డున ప‌డింది. అలాంటి కుటుంబానికి అన్యాయం చేస్తూ.. నిజ‌మైన నేర‌స్తుడిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌డం.. కుట్ర పూరితంగా కేసును వేరే వారి పేరుపై న‌మోదుచేయించ‌డం వంటివి సీదిరి చేసిన త‌ప్పులు కాదా? అనేది జ‌గ‌న్ ఆలోచ‌న చేసుకోవాల్సి ఉంది. ఇక‌, సీదిరి చేసిన‌ త‌ప్పు కార‌ణంగా.. న‌లుగురు పోలీసు అధికారులు స‌స్పెండ్ అయ్యారు. మ‌రి వారి ప‌రిస్థితి ఏంటి? వారిపై కూడా చంద్ర‌బాబు కక్ష గ‌ట్టారా? అనే దానికి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి. ఇంతమంది బాధితులను వదిలేసి నిందితులుగా పోలీసులు తెలుపుతున్న వారిని పరామర్శించడం ఎంతవరకు సబబు జగన్ కే తెలియాలి.

రాజ‌కీయంగా సీదిరి ప్ర‌స్తుతం సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గ‌మే ఆయ‌న‌ను దూరం పెట్టింది. ఇక‌, చంద్ర‌బాబుకు ఆయ‌న‌తో రాజ‌కీయ వైరం ఏముంటుంది. పైగా.. ప‌లాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఏమైనా రాజ‌కీయంగా సీదిరిలో పొలిటిక‌ల్ ఇష్యూల‌పై పోరాడ‌వ‌చ్చు. కానీ, అస‌లు సంబంధ‌మే లేని చంద్ర‌బాబును ఎలా లాగుతార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌, సీదిరిపై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టార‌న్న‌ది జ‌గ‌న్ ప్ర‌శ్న‌. ఇది నిజ‌మే అయితే.. కోర్టుకు వెళ్లిపోరాడితే ఫ‌లితం ఉంటుంది త‌ప్ప‌.. ఇలా రోడ్డెక్కితే ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది మ‌రో సందేహం!.