ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం.. చేజేతులారా పంజాబ్ అధికారాన్ని చేజార్చుకోవడం.. పార్టీలోని సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత.. భవిష్యత్‌పై అయోమయం.. ఇలాంటి పరిస్థితి నుంచి తిరిగి పార్టీని గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఫోకస్ పెట్టి అక్కడ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌తో జట్టు కట్టింది. ఇప్పుడిక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటకపై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన వరుసగా అక్కడ పర్యటించడం వెనక అదే కారణం ఉందనే విషయం స్పష్టమవుతోంది.
కర్ణాటకలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మరో ఏడాది కాలంలో అక్కడి జరిగే ఎన్నికలపై రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి నుంచే పార్టీ నేతలు, శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కనీసం 150 సీట్లు గెలవాలని రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవాన్ని తీసుకు రావాలని ఆయన పార్టీ నేతలకు నిర్దేశించారు. పనిచేసే వాళ్లకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కలిసికట్టుగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఏడాది మేలో షెడ్యూల్ ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 224 స్థానాలున్న ఆ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే పార్టీ నేతలను సిద్ధం చేస్తోంది.
శాసన సభ ఎన్నికల్లో కనీసం 150 సీట్లు సాధించి అధికారం దక్కించుకునే దిశగా కసరత్తులు చేస్తోంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, మల్లిఖార్జున ఖార్గే లాంటి అగ్ర నేతలు కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని ఆయన సూచించారు. పంజాబ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతల్లో చీలిక రాకుండా ఉండేలా రాహుల్ జాగ్రత్త పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ముందుగానే అక్కడ పర్యటించి నేతలందరినీ ఒక్కతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.