రోజా కోరికను పట్టించుకోని జగన్

జిల్లాల పునర్వ్యవస్ధీకరణలో తీవ్రంగా నిరాశ పడిన ఎమ్మెల్యేలలో రోజా కూడా ఒకరు. నగిరి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా పరిధిలోకి వెళ్ళింది.  అయితే తన జిల్లాను చిత్తూరు జిల్లాలోకి కాకుండా తిరుపతి జిల్లాలోకి చేర్చాలని రోజా శతవిధాల ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డిని రెండు మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది.

ఇక్కడ రోజా సమస్యంతా కేవలం రాజకీయపరమైనదే కానీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నది కాదని జగన్ అభిప్రాయపడటం వల్లే ఆమె డిమాండును పట్టించుకోలేదు. ఎంఎల్ఏ రాజకీయపరమైన అజెండా ఏమిటంటే మంత్రి పదవిని అందుకోవటమే. ఇపుడు చిత్తూరు జిల్లాల్లో నగిరితో పాటు గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి.

ఒకే జిల్లాలో పుంగనూరు, నగిరి ఉండటం వల్ల రోజాకు బాగా ఇబ్బందులు తప్పటం లేదు. ఎందుకంటే మంత్రివర్గంలో కానీ ఇతరత్రా విషయాల్లో కానీ పుంగనూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని రోజాను జగన్ పరిగణలోకి తీసుకోరన్నది వాస్తవం. అందుకనే తమ రెండు నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటే పెద్దిరెడ్డిని తట్టుకుని రాజకీయంగా ఎదగటం లేదా మంత్రిపదవి దక్కించుకోవటం కష్టమని రోజా డిసైడ్ అయినట్లున్నారు.

అందుకనే నగిరి నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరుపతి జిల్లాలో కలపాలంటు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్ధీకరణ జరిగేంత వరకు ప్రతి విషయంలోను పెద్దిరెడ్డిని రోజా ఎదుర్కోక తప్పదు. పెద్దిరెడ్డిని ఎదుర్కొనేంత సీన్ రోజాకు లేదు కాబట్టి ఆయనతో సర్దుకుని వెళ్ళటం తప్ప వేరే దారిలేదు. అయితే సర్దుకుని వెళ్ళటం రోజాకు ఇష్టముండదు. అందుకనే రాజకీయంగా రోజాకు ముందంతా పెద్దిరెడ్డితో పోరాటాలు తప్పవని తేలిపోయింది. మొత్తానికి రోజాను జగన్ పెద్దిరెడ్డి దగ్గర భలేగా ఫిక్స్ చేసేశారని పార్టీలోనే టాక్ నడుస్తోంది.