“ఏపీసీఎం జగన్ ప్రిజనరీ అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ“ అంటూ.. టీడీపీ యువ నాయకుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ నెల 29 నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున తరలి వస్తారని లోకేశ్ వెల్లడించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 నుంచి.. ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడతామని లోకేశ్ స్పష్టం చేశారు. చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తామన్నా రు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ న్యాయవ్యవస్థ పై దాడికి దిగలేదన్న లోకేశ్.. పదోతరగతి తప్పిన మూర్ఖపు ఆలోచనతో న్యాయ వ్యవస్థపైనే జగన్ రెడ్డి దాడికి దిగారని ధ్వజమెత్తారు. భూ త్యాగాలు చేసిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు జగన్ రెడ్డి ప్రారంభోత్సవాలు కూడా చేయలేదని దుయ్యబ ట్టారు. 40 గంటల పాటు సాగిన అసెంబ్లీలో.. సారా మరణాలపై 40 నిమిషాలు పాటు చర్చించలేరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని సీఎం.. 3 రాజధానులు కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు. ప్రిజనరీకి.. విజనరీకి ఉన్న తేడా ప్రజలు గుర్తించాలని లోకేశ్.. ప్రిజనరీ వ్యవస్థల నాశనం గురించి ఆలోచిస్తే.. విజనరీ భావి తరాల బాగు కోరుకుంటాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అయితే చంద్రబాబు విజనరీ అన్నారు.
జగన్ విశాఖ వెళ్లి కూర్చుంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయని… జగన్ విశాఖ వెళ్తే అరాచకాలు మరింతగా పెరుగుతాయని ఆరోపించారు. విజయసాయి దెబ్బకు విశాఖలో అందరూ భయపడుతున్నారని… రేపు సీఎం జగన్ విశాఖ వెళ్తే ఇంకా భయపడతారని అన్నారు. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడని చెప్పారు.
పరిపాలన కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి అని స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే జరుగుతుందని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది తామేనన్నారు. పరిపాలన ఒకేచోట ఉంచి.. అన్ని జిల్లాల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.
పీపీఏల రద్దుతో ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావట్లేదని… తమ ఒప్పందాలు కొనసాగించి ఉంటే విశాఖ రూపురేఖలే మారేవని లోకేష్ అన్నారు. అభివృద్ధి చేయలేకే జగన్ 3 రాజధానుల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. ఆరోజు అమరావతికి మద్దతు పలికి ఇవాళ కాదనడం మోసం కాదా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటని లోకేష్ నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates