కశ్మీర్ ఫైల్స్… ఈ మధ్య కాలంలో రాజకీయ వర్గాలు అతి ఎక్కువగా స్పందించిన సినిమా అనుకోవచ్చు. కారణాల సంగతి అలా ఉంచితే, ఈ సినిమా కలెక్షన్లు బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. అదే సమయంలో పలు రాష్ట్రాలు ఈ సినిమాలకు ట్యాక్స్ రిబేట్ సైతం ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ సినిమాపై స్పందించారు.
ఇలా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కశ్మీర్ ఫైల్స్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ గవర్నమెంట్ కూడా కశ్మీర్ ఫైల్స్ మూవీకి ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
దీనిపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో స్పందిస్తూ, కశ్మీర్ ఫైల్స్ సినిమాని యూట్యూబ్ లో పెట్టాలని, అట్లయితే అందరూ చూస్తారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ… కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, అవన్నీ ఎందుకు యూట్యూబ్ లో పెడితే ప్రజలు ఫ్రీగా చూస్తారు కదా అని కౌంటర్ ఇచ్చారు. అందుకు కశ్మీర్ ఫైల్స్ యూనిట్ తో మాట్లాడి ఏర్పాటు చేయాలని బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా బీజేపీపై కేజ్రీవాల్ మండిపడ్డారు. చిత్ర బృందం కంటే కూడా బీజేపీ నాయకులే కశ్మీర్ ఫైల్స్ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కశ్మీర్ పండిట్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వ్యాపారం కోసం కశ్మీర్ పండిట్లను వాడుకోవడం సిగ్గుచేటని కేజ్రీవాల్ మండిపడ్డారు. కశ్మీర్ ఫైల్స్ ను ప్రజలకు చేరువ చేయడంలో బిజీగా ఉన్న వర్గాలు కేజ్రీ కామెంట్ పై ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.