పెగాస‌స్ : ఏబీ వెంక‌టేశ్వ‌ర్లు ఇచ్చిన క్లారిటీ ఇదే!

వైసీపీ ఆరోపిస్తున్న విధంగా పెగాస‌స్ సాఫ్ట్వేర్ ను అప్ప‌టి ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవ‌ని తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు కూపీ లాగుతుండ‌గా తాజాగా సీన్లో కి అప్ప‌టి ఇంటెలిజెన్స్ డీజీ వ‌చ్చి త‌న దైన వివ‌ర‌ణ ఒక‌టి ఇచ్చారు. ప్ర‌భుత్వ‌మే కాదు ఏ ప్ర‌యివేటు సంస్థ కూడా సంబంధిత నిఘా సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసిన దాఖాలాలు ఏవీ లేవ‌ని కూడా ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. ఇవాళ మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న ప‌లు వివ‌రాలు వెల్ల‌డిస్తూనే, త‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని దీనిపై  వివ‌ర‌ణ ఇచ్చేందుకు తాను సిద్ధ‌మేన‌ని అన్నారు.

దీంతో రాజ‌కీయంగా రేగుతున్న దుమారంపై ఏబీ వేంక‌టేశ్వ‌ర్లు కొంత త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించారా లేదా ఆ రోజు ప్ర‌భుత్వాన్ని వెనకేసుకుని వచ్చేందుకు సిద్ధం అయ్యారా? అన్న‌ది ఇప్పుడు వైసీపీ నుంచి వ‌స్తున్న సందేహాలు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని,త‌న‌కంటూ వ్య‌క్తిత్వం ఉంద‌ని దానిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని అందుకే ఇవాళ మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నాన‌ని అన్నారు. ఆల్ ఇండియా స‌ర్వీసెస్ రూల్స్ ప్రకార‌మే తాను ఇవాళ మాట్లాడుతున్నానని కూడా చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంచ‌నాలు రేపుతున్న పెగాస‌స్ స్పై వేర్ కొనుగోలుకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి, అప్ప‌టి నిఘా విభాగాధిప‌తి ఏబీ వేంక‌టేశ్వ‌ర్లు క్లారిఫికేష‌న్ ఇచ్చారు.అసలు ఆ త‌రహా కొనుగోళ్లు ఏవీ చేయలేద‌ని,అవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలు అని తేల్చేశారు.త‌న‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న డిజిట‌ల్ మీడియాలపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని కూడా చెప్పారు. అదేవిధంగా ఆ రోజు జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటికీ సంబంధించి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని కూడా అన్నారు. ఏపీలో పెగాస‌స్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయ‌లేద‌ని గ‌ట్టిగా చెబుతున్నాన‌ని అన్నారు.

అదేవిధంగా ఇందుకు సంబంధించి నిరాధార క‌థ‌నాలు రాసినా ఒప్పుకునేదే లేద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఎవ‌రి ఫోన్ల‌నూ ట్యాప్ చేయ‌లేద‌ని అన్నారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ 2019 మే వ‌ర‌కూ పెగాస‌స్ సాఫ్ట్ వేర్ కొనుగోలు అన్న‌దే లేద‌ని చెప్పారు.అదేవిధంగా ఆ రోజు త‌న స‌స్పెన్ష‌న్ కు దారి తీసిన ప‌రిణామాలు, వాటికి సంబంధించి పూర్వ‌ప‌రాలు ఇలా అన్నింటినీ వివ‌రించేందుకు ఆయ‌న మీడియా ఎదుట ప్ర‌య‌త్నించారు.కొన్ని లిఖిత పూర్వ‌క ఆధారాలు కూడా మీడియాకు అందించారు. 2019 వ‌ర‌కూ ఏం జ‌రిగిందో అన్న‌ది త‌న‌కు తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.