వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? అనే విషయంపై సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాజాగా జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ఆయన మొహమాటంలేకుండా వెల్లడించారు. “ఒక్కమాట స్పష్టం చెప్తున్నాను. ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ చేయకపోతే.. సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు నిరాకరిస్తాను. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే… జుట్టు ఉంటేనే ముడేసుకోవచ్చు.. లేకపోతే.. ఎలా?. గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ పోవాలి.“ అని స్పష్‌టం చేశారు.
కాలర్ ఎగరేసుకుని చెప్పండి!
కోవిడ్ వచ్చినందు వల్ల … ఇంతకుముందుకన్నా.. ప్రజలకు కాస్త దూరంగా ఉండి ఉండొచ్చు. కోవిడ్‌వల్ల ఎవరి దగ్గరకు వెళ్లాలన్నా.. కష్టం అయ్యింది. ప్రజలు మనల్ని కలవాలంటే.. మన ఇంటికి రావాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనం వెళ్లాలి. సంతృప్తకర స్థాయిలో కాలర్ ఎగరేసుకుని… మనం ఇదీ చేశాం అని చెప్పుకునే పరిస్థితి మనకు ఉంది. ఎవరికైనా ఫలానా పథకం కావాలన్నా.. ఇంకేదన్నా పారదర్శకంగా, సోషల్ ఆడిట్ ద్వారా సచివాలయంలో జాబితా ప్రదర్శించి… అర్హత ఉన్న ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా సగర్వంగా పథకాలు అందించాం. ఇది వాస్తవం అని పేర్కొన్నారు.
మెండైన సంతృప్తి
“చిరునవ్వుతో, ఆనందంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతాం. సంతృప్తి కలుగుతుంది. ఇంతమంది ప్రజల జీవితాలను మార్చగలిగా మనే తృప్తి మనకు ఉంది.భవిష్యత్ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునేలా పనిచేశాం. రాజకీయనాయ కులుగా మనకు కావాల్సింది ఇలాంటి తృప్తే. శాచ్యురేషన్ విధానంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. మనం నాలుగు అడుగులు ముందుకేశాం. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించాం. 31 లక్షల ఇళ్లు జగనన్న కాలనీలు పేరుతో ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. మనం గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగలం. ఇవే విషయాలను చెప్పాలి.“ అని జగన్ సూచించారు.
ప్రజల్లో ఉంటేనే ఫలితం..
ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం జగన్ చెప్పారు. “ప్రజల్లో ఎప్పుడైతే తిరగడం మొదలు పెడతామో… మంచిని కూడా చూడగలుగుతాం. సచివాలయాల్లో తిరిగినప్పుడు వాటి పర్యవేక్షణ కూడా చేస్తారు. సలహాలు, సూచనలు ఇస్తే.. మీ దగ్గర నుంచి నా వరకూ తీసుకురావడానికి ఒక వ్యవస్థనుకూడా తయారుచేస్తాం. మీరు వెళ్లేటప్పటికి ఆ వ్యవస్ధ కూడా తయారవుతుంది. మంత్రులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కోర్డినేటర్లగా బాధ్యతలు తీసుకుంటారో వారంతా ఈ బూత్ కమిటీలు, గడప, గడపకు చేసే కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తారు.“ అని వివరించారు.
పనితీరే ప్రామాణికం..
ఎమ్మెల్యేలుగా ఉన్నవారి పనితీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడించారు. “చాలా ముఖ్యమైన అంశమిది. ఇక్కడ మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే.. రాబోతున్నది పరీక్షా సమయం. మరో 2 సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోంది. కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. మూడేళ్లు గడిచిపోయింది. ఈ రెండేళ్లలో మనం ఏం చేస్తామన్నది ముఖ్యం. మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు అన్నదాన్ని బట్టి… మనం చేసిన మంచిని ఎలా ప్రజల్లోకి తీసుకుపోయామన్నదాన్ని బట్టి ఉంటుంది“ అని జగన్ వెల్లడించారు.
ఉపేక్షించేది లేదు!
“ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది మీ వ్యక్తిగత తప్పిదమే అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరు పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదు. పనితీరు సరిగ్గా లేకపోతే.. సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ అవకాశం ఇవ్వకూడదని కోరుతున్నా. మీకు తగిన సమయం ఇస్తున్నా. ఇప్పటివరకూ ఎలా ఉన్నా? ఇకపై ముందుకు కదలాలి. అది మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకొండి“ అని జగన్ దిశానిర్దేశం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates