ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు జనసేన ఎంతటి ఉద్వేగంతో ఉందో అందరికీ తెలిసిందే! నాటి పరిస్థితుల రీత్యా పవన్ ఎంతో ఆవేశంతో మాట్లాడేవారు. తరువాత తీవ్ర స్థాయిలో ఓటములు ఆయనను కలిచివేశాయి. అభిమానులే తనను నిరాశ పరిచారని, నమ్ముకున్న వాళ్లంతా తనను నట్టేట ముంచారని పవన్ బాధపడ్డారు. ఓ సందర్భంలో పార్టీ ఆఫీసులో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు కూడా! మీరు సీఎం సీఎం అని అరవకండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరు.. నా దగ్గర పవర్ లేదు అలాంటప్పుడు ఈ పవర్ స్టార్ గోలేంటి.. అని కూడా ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ప్రజలకు చేయాల్సిన మంచేదో చేస్తాననే అంటున్నారు.
ఇక ఇవాళ మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గతం కన్నా భిన్నంగా శ్రేణులు భారీ స్థాయిలో తరలి రానున్నారు. అదేవిధంగా సభకు హాజరయ్యే వారంతా క్రమశిక్షణ పాటించాలని, జిల్లాల నుంచి వచ్చేవారు టోల్ గేట్ సిబ్బందితో వాదులాటకు దిగరాదని కూడా పవన్ హితవు చెప్పారు. ఇక పొలిటికల్ గా పవన్ గురించి చెప్పాలంటే..ఇప్పటిదాకా ఆ రెండు పార్టీలకు ప్రత్యక్షంగానో పరోక్షంగా సాయం అందించా రు. 2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎంతో సాయం చేశారు.
ఆయా సందర్భాల్లో ఓ విధంగా పొలిటికల్ న్యూట్రాలిటీనే పాటించారు. ఇంకా చెప్పాలంటే ఆయన అనుకున్న వాటికి అనుగుణంగా పనిచేయలేకపోయారు కూడా! ఇదే సందర్భంలో పవన్ ను ఓడించేందుకు మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించారన్న ఆరోపణలు లేదా అభియోగాలు ఇవాళ్టికీ వైసీపీపై మోపుతూనే ఉంది జనసేన. ఏ విధంగా చూసినా ఆ రోజు పవన్ ను నిలువరించేందుకు ఎన్నో ఇబ్బందులు పెట్టేందుకు జగన్ చేసిన పనులు అన్నీ సత్ఫలితాలే ఇచ్చాయి అన్నది జనసేన వాదన.
ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారని, ఓ వైపు పవన్ పార్టీ ప్రభావం తమపై ఉండదని భావిస్తూనే, ప్రకటిస్తూనే మరోవైపు జనసేన ఉత్సాహాన్ని కట్టడి చేసేందుకు ముందస్తు అరెస్టులు అంటూ నిన్నటి వేళ తెగ హంగామా చేసిందది వైసీపీ సర్కారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోయినా భవిష్యత్ కాలంలో మాత్రం వీటి విషయమై తప్పక చర్చకు వస్తుంది. ఇదే సమయంలో పవన్ తప్పిదాలు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఆ రోజు ఉన్న విధంగా ఈరోజు లేరు. లేకపోయినా పర్లేదు కానీ అది కాలం తెచ్చిన మార్పు అని సర్దుకుపోవచ్చు కానీ మరీ ఇంత సౌమ్యంగా రాజకీయాలు చేస్తే మాత్రం ఆయన నెగ్గడం కష్టం. కనుక జనసేన గెలవాలంటే ప్రత్యర్థులను తొక్కుకుంటూ పోవాలె!