5 రాష్ట్రాల ఫలితాలు.. 2024 ఆశలు

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోలుకునే పరిస్థితి లేదని ఈ ఎన్నికలతో తేలిపోయింది. పొలిటికల్ గేట్ వే టు ది పీఎం చైర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకొనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పాలక బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నా పదుల సంఖ్యలో స్థానాలను కోల్పోయింది. అయితే, గత ఎన్నికల కంటే సీట్లు తగ్గినా ఓట్ల శాతం మాత్రం బీజేపీకి పెరిగింది. ప్రధాని మోదీ, సీఎం యోగిల ఆకర్షణ శక్తికి సంక్షేమ అజెండా తోడవడం… విపక్షాలకు ధీటైన నాయకత్వం లేకపోవడం, వారిలో అనైక్యత, బలహీనతలు, భయాలు, లోపాయికారీ ఒప్పందాలు అన్నీ కలిసి బీజేపిని మళ్లీ యూపీ పీఠంపై నిలబెట్టాయి.

ఇక పంజాబ్ విషయానికొస్తే అక్కడ ఆప్ అధికారంలోకి రావడం పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ చాలా పెద్ద మార్పు అనే చెప్పుకోవాలి. ఆమ్ ఆద్మీ పంజాబ్‌లో సాధించిన ఘన విజయాన్ని ఏమాత్రం తక్కువ చేయడానికి అవకాశం లేకపోయినా అక్కడ కాంగ్రెస్ స్వయంకృతాపరాధాల గురించీ మాట్లాడుకోవాలి. ఒక పార్టీని విజయ పథంలో నడిపించడానికి ఒక్క నాయకుడు సరిపోతాడో చాలడో చెప్పలేం కానీ ఒక పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి మాత్రం ఒక్క నాయకుడు చాలని పంజాబ్ ఎన్నికలు నిరూపించాయి. కాంగ్రెస్ పార్టీకి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రూపంలో అలాంటి నాయకుడు దొరికాడు.

దిల్లీ రాష్ట్రంలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చాలాకాలంగా విస్తరణ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌లో అవకాశాలు వెతుక్కుంటున్న ఆ పార్టీ స్థిరంగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు అక్కడ అధికారం అందుకుంది. పంజాబ్ విజయం అందించిన ఉత్సాహంతో కేజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ విస్తరించే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లోనూ బీజేపీ అధికారం అందుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమం, అందుకు అండగా నిలిచిన కాంగ్రెస్ వంటి అంశాలేమీ ఈ ఎన్నికల ఫలితాలలో కనిపించలేదు. వ్యవసాయ చట్టాల కారణంగా మోదీ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిందనుకుంటూ సాగిన అంచనాలేవీ నిజం కాదని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రైతులకు అన్ని

ఉత్తరప్రదేశ్‌లో ఎంతో కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలే రావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. రాహుల్ గాంధీ వల్ల సాధ్యం కానీ కాంగ్రెస్ జీర్ణోద్ధరణ ప్రియాంకా గాంధీ వల్ల మాత్రమే సాధ్యమని అంతా అనుకుంటున్న తరుణంలో ఆ భ్రమలనూ తొలగించాయి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు. ప్రియాంక కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు దక్కినవి రెండు సీట్లే. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నా ఆ పార్టీ టికెట్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు గతంలో మాదిరిగా బీజేపీలోకి ఫిరాయించరన్న గ్యారంటీ లేదు.

ఇక ఈ ఎన్నికలలో గోవాలో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్, ఉత్తర ప్రదేశ్‌లో 100కిపైగా స్థానాలలో పోటీ చేసి ఒక్క సీటు గెలవని ఎంఐఎం, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న అంచనాలతో జాతీయ కలలు కంటున్న కేసీఆర్, కాంగ్రెస్ పుంజుకుంటే మళ్లీ రాహుల్ గాంధీతో చేయి కలిపి జగన్‌ను కుర్చీ దించేయొచ్చని ఆశలు పడుతున్న చంద్రబాబు, ఉత్తర ప్రదేశ్‌లో ఓడిపోతే మోదీ హవా తగ్గి తాము రైజింగ్‌లోకి రావాలని ఎదురుచూస్తున్న బీజేపీలోని ఓ వర్గం ఆశలపై నీళ్లు చల్లాయి ఈ ఎన్నికల ఫలితాలు.