`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ముందడుగు వేస్తోంద‌న్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌.. మాట్లాడుతూ.. ఏపీలో గూగుల్ డేటా కేంద్రం, అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ సిటీ వంటివి ఏపీకి ఏఐ మ‌ణిహారాలుగా మార‌నున్న‌ట్టు చెప్పారు. వృద్ధి రేటు కూడా పుంజుకుంటోంద‌ని తెలిపారు.

2026లో ఏఐ ప్ర‌పంచ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్టు మంత్రి చెప్పారు. దీనిలో ఏపీని కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 200 ఏఐ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. దీనిలో ఏపీని కూడా భాగ‌స్వామ్యం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. డేటా కేంద్రం రాక‌తో ఏపీలోని విశాఖ రూపు రేఖ‌లు మార‌నున్న‌ట్టు చెప్పారు. ఆర్థికంగానే కాకుండా.. సాంకేతికంగా కూడా రాష్ట్రం వృద్ధి చెందుతోంద‌న్నారు. దీనికి కేంద్రం నుంచి అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నామ‌ని వివ‌రించారు.

ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏఐకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు మంత్రి పార్ల‌మెంటు(రాజ్య‌స‌భ‌)లో వివ‌రించారు. అమ‌రావ‌తిలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు అందించిన విష‌యాన్ని ఆయన గుర్తు చేశారు. వ‌చ్చే 20 ఏళ్ల‌లో ఏఐ ప్ర‌భావిత రంగాల్లో ఉద్యోగుల‌కు ఇక్క‌డ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ఏపీలోని విశాఖ‌తో పాటు.. మహారాష్ట్ర, యూపీ ల‌లోనూ.. డేటా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయ‌ని, వీటికి కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం అందుతుంద‌ని చెప్పారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే నెల‌లో అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ వ్యాలీ ఏర్పాటుకు ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైంది. దీని ద్వారా.. 20 వేల మందికి పైకి ఉద్యోగాలు పొందేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. అదేవిధంగా విశాఖ‌లో డేటా కేంద్రం, అమ‌రావ‌తిలో ఏఐ యూని వ‌ర్సిటీల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా.. మొత్తంగా ఏఐ ఆధారిత రంగాల‌కు ప్ర‌భుత్వంప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనివ‌ల్ల ఆర్థికంగా కూడా రాష్ట్రానికి వృద్ధి చేకూరుతున్న‌ట్టు పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం పేర్కొన‌డం విశేషం.