తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. వైద్యులు కేసీఆర్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు గుండె, యాంజియో, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎంవో వెల్లడించింది. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ సైతం.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ఇటీవల దిల్లీలో కూడా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ బలహీనంగా ఉన్నారని… వైద్యులు ఎం.వి. రావు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు చెప్పారు. జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.
కాగా, “రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్‌గా ఉన్నారు. ఎడమచేయి లాగుతున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది“ అని వైద్యులు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. సీఎం పర్యటన రద్దుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. యాదాద్రికి వెళ్లారు.