పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తొందరలోనే ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో వివక్షకు గురవుతున్న, బాధిత ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో తమ అధినేత్రి సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తృణమూల్ సీనియర్ నేతలు చెప్పారు.
జాతీయ స్ధాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేనందునే కేంద్రంలో బీజేపీ అధికారంలో కంటిన్యూ అవుతోందని మమత అభిప్రాయపడ్డారు. ఇక్కడే మమత వైఖరి చాలా విచిత్రంగా ఉంది. బీజేపీని తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్న మమత అంతే స్థాయిలో కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒకేసారి రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకిస్తున్న మమత బీజేపీకి బలమైన ప్రత్యామ్నయ వేదిక లేదని బాధపడిపోవటమే విచిత్రంగా ఉంది. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాధ్యం కాదని అందరికీ తెలిసిన విషయమే.
తొందరలోనే కేసీయార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళకు ఆహ్వానాలు పంపబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ముఖ్యమంత్రుల్లో మమతను కలిసేందుకు కేసీయార్ తప్ప ఇంకోళ్ళెవరు సిద్ధంగా లేరు. స్టాలిన్ ఇప్పటికీ యూపీఏ కూటమిలో ఉన్నారు. ఒడిస్సా సీఎం పట్నాయక్ ఎవరితోను కలవటం లేదు. మహారాష్ట్ర అధికార కూటమిలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసున్నాయి. కాబట్టి పై రెండు పార్టీలు మమతకు మద్దతుగా నిలిచే అవకాశం లేదు.
బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తృణమూల్ తో చేతులు కలిపే అవకాశాలు లేవు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటివరకు మమతతో చేతులు కలుపుతానని ఎక్కడా చెప్పలేదు. సో ఏ పద్దతిలో చూసినా మమతకు మద్దతుగా కేసీయార్ తప్ప మరో సీఎం మద్దతిచ్చే అవకాశాలు దాదాపు లేదు. ఇద్దరు సీఎంలు కలిసి కేంద్రంలో బీజేపీని ఏ విధంగా అధికారంలో నుండి దింపగలుతుందో మమతే చెప్పాలి. చివరకు మమత నిర్వహించాలని అనుకుంటున్న బాధిత ముఖ్యమంత్రుల సమావేశానికి ఎంతమంది హాజరవుతారనే విషయం ఆసక్తిగా మారింది. మరి మమత ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates