ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి గవర్నర్ హరిచందన్ వత్తాసు పలుకుతున్నారని, గో బ్యాక్ గవర్నర్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వ తీరుపై, గవర్నర్ వ్యవహార శైలిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యవస్థలపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, గవర్నర్ పేరును వాడుకొని ప్రభుత్వం అప్పులు తెచ్చినా పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అవాస్తవాలేనని, అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని వెల్లడించారు. వైసీపీ సర్కారు తీరుపైనా అచ్చెన్న మండిపడ్డారు.
అమరావతే ఏపీ రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన బొత్స మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని ప్రకటించడాన్ని అచ్చెన్న దుయ్యబట్టారు. 2024 వరకు తెలంగాణ, ఏపీలకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అని బొత్స అన్నారని, అటువంటపుడు జగన్ హైదరాబాద్ నుంచే పాలించాలని తనదైన శైలిలో చురకలంటించారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం రాష్ట్రం నుంచి పాలించాలని అమరావతికి వచ్చారని స్పష్టం చేశారు.
అంతకుముందు జరిగిన బీఏసీ సమావేశంలో తనపై జగన్ చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వయసును గౌరవించకుండా అవమానించడం సరికాదని జగన్ అన్నారని, తాము గవర్నర్ తప్పిదాలనే ఎండగట్టామని క్లారిటీ ఇచ్చారు. ఆమాటకొస్తే టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా..? అంత వయసున్న చంద్రబాబును సభలో జగన్ అవమానించ లేదా..? అని అచ్చెన్న నిలదీశారు. మరి, అచ్చెన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.