పవన్ ఎప్పటికి ఫ్రీ అవుతాడు?

2019 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే పవర్ స్టార్ ట్యాగ్ వదిలేసి జనసేనానిగా మారాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆయన జనాల్లోకి వెళ్లాడు. దీంతో ఆయన్ని అందరూ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించకుండా.. అభ్యర్థుల ఎంపికలో సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా ఎన్నికల్లోకి వచ్చేయడం వల్లే ఆయనకు చేదు అనుభవం ఎదురైందని రాజకీయ విశ్లేషకులు తీర్మానించారు.

అప్పటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని 2024 ఎన్నికల ముంగిట సమర్థంగా వ్యవహరిస్తాడని కార్యకర్తలు ఆశించారు. ఈసారి ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నుంచి సన్నద్ధత ఉండాలని, ఈ రెండేళ్లూ జనాల్లోనే ఉంటూ.. పార్టీని బలోపేతం చేస్తూ, అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసి వారి వారి నియోజకవర్గాల్లో తిరుగుతూ జనాల మనసులు గెలిస్తేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టే అవకాశముందన్న అభిప్రాయం అందరి నుంచీ వ్యక్తమైంది.

ఐతే ఇక సినిమాలే చేయను అన్న పవన్.. రెండేళ్ల కిందట ముఖానికి మళ్లీ రంగేసుకున్నాడు. వరుసబెట్టి సినిమాలు ఓకే చేశాడు. చకచకా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇదేమీ అభ్యంతరకరమైన విషయం కాదు. మిగతా పార్టీల నేతలు ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకుంటున్నారు. డబ్బులు సంపాదించుకుంటున్నారు. పవన్ తన ఆదాయ మార్గమైన సినిమాలు చేసుకోవడం తప్పు కాదు. కానీ వీటికి ఎంత సమయం కేటాయించాలి.. ఎప్పుడు సినిమాలు విడిచిపెట్టి పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలన్నది కీలకం. ఎక్కువ కాలం రెండు పడవల ప్రయాణం చేస్తే కుదరదు. ఈ ఏడాదే మధ్య నుంచే సినిమాలను పక్కన పెడితే మేలు అన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ముందు ఉన్న కమిట్మెంట్ల ప్రకారం అయితే ఈ ఏడాది మధ్యలోనే చేతిలో ఉన్న సినిమాలన్నీ అవగొట్టేసి ఉండాలి. కానీ ఆల్రెడీ కమిటైన సినిమాల మధ్యలోకి వేరేవి తీసుకురావడంతో వస్తోంది సమస్య. భీమ్లా నాయక్ ఇలా వచ్చిన సినిమానే. ఇప్పుడేమో ‘వినోదియ సిత్తం’ రీమేక్ వచ్చి పడింది. దీని వల్ల ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు ‘తెరి’ రీమేక్ కూడా ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇవన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలంటే ఇంకో ఏడాదిన్నరైనా పడుతుంది. అదే జరిగితే 2019లో మాదిరే 2024 ఎన్నికలకు ముందు కూడా ఆరు నెలలు మాత్రమే పవన్ ప్రజా క్షేత్రంలో ఉంటాడని భావించాలి.