ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే కొన్ని జిల్లాలను శాసిస్తున్న కీలక నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ఇకపై సర్వం తానే అయి వ్యవహరించనున్నారు. పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అన్నింటినీ ఆయనే చూసుకునేలా.. సీఎం జగన్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇకపై పార్టీలో అన్నీ తానే అయి.. సాయిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను అప్పగించారు. ఈ విభాగాలకు విజయసాయిని ఇంఛార్జిగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ.. దాదాపు ప్రత్యక్షంగానో.. పరోక్షంగా ఆయన అన్ని విభాగాలు, సమస్యలు.. పరిష్కారాలను చూస్తున్నారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా.. ఆయనే స్పందిస్తున్నారు. అయితే.. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో విజయసాయిరెడ్డి ఇక నుంచి పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను కూడా చూసుకోనున్నారు.
గతంలో విజయసాయికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. కొంతకాలం క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఎందుకంటే.. అక్కడ సాయిరెడ్డి దూకుడు కారణంగా.. తాము ఇబ్బందులు పడుతున్నామని.. నాయకులు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా కీలకనేతలుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా సాయిరెడ్డి ప్రాధాన్యం ఇవ్వలేదనే వ్యాఖ్యలు వినిపించాయి.
అదేస మయంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ను కూడాడమ్మీ చేశారనే వాదన ఉంది. ఇక, కార్పొరేషన్ ఎన్నికల్లో సర్వం తానే అయి చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో నాయకులు తీవ్రంగా మధన పడ్డారు. తమ అధికారం.. తమ ప్రభావం రెండూ తగ్గిపోతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డిని అక్కడ నుంచి తప్పించి.. ఖాళీగా కూర్చోబెట్టారు. అయితే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. తాజాగా వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను అప్పగించడంతో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు మరింత పెరగనున్నాయి. మరి ఆయన ఏవిధంగా సమన్వయం చేసుకుని.. పార్టీని ముందుకు నడిపిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates