తెలంగాణాలో జనసేన మళ్ళీ యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తోందా ? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలనే పెంచుతున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో మాట్లాడుతు ప్రతి నియోజకవర్గంలోను క్రియాశీల కార్యకర్తలను తయారు చేసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో కనీసం 100 మంది క్రియాశీల కార్యకర్తలను తయారుచేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకోవాలన్నారు.
తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నేతలంతా పనిచేయాలని నాదెండ్ల చెప్పటంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణాలో జనసేన పార్టీ నామమాత్రంగా ఉంది. కేవలం మీడియా ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. పవన్ ఎప్పుడైనా సమావేశాలు పెడితే అప్పుడు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తుంటుంది.
2014, 2019 లో జరిగిన ఎన్నికల్లోనే పవన్ తెలంగాణాను పూర్తిగా వదిలేశారు. దాంతో ఏపీలో ఏదో కాస్త ఉందని అనుకున్న పార్టీ యాక్టివిటీస్ తెలంగాణాలో దాదాపు శూన్యమైపోయాయి. అలాంటిది 2023లో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్న సమయంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ అనుకుంటున్నారంటేనే ఏదో తేడాగా ఉంది. తెలంగాణాలో టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయా అని అనిపిస్తోంది.
ఎందుకంటే ఏపీలో బీజేపీకి మిత్రపక్షమే అయినా తెలంగాణాలో మాత్రం అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పైగా ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపై బీజేపీ నానా రచ్చ చేస్తుంటే పవన్ మాత్రం కేటీయార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మొన్నటి భీమ్లానాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కేటీయార్ ను పవన్ ఆహ్వానించటమే నిదర్శనం. దీంతోనే పవన్ వ్యవహారశైలిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మెల్లిగా కేసీయార్ కు దగ్గరవుదామని పవన్ ప్రయత్నిస్తే రేపటికి అది పొత్తుగా మారే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఏపీలో కూడా బీజేపీతో కటీఫ్ తప్పదు మరి చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.