త‌న‌యుడి కోసం త‌ప్పుకోనున్న బొత్స‌!

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నారా? రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లోకి త‌న త‌న‌యుడి రంగ‌ప్ర‌వేశం కోసం ఆయ‌న త‌ప్పుకుంటున్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌ని, త‌న కొడుకును బ‌రిలో దించుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల‌కు, వ‌య‌సుకు పెద్ద‌గా సంబంధం లేక‌పోయినా బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుత‌మున్న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటేనే మేల‌ని భావిస్తున్నార‌ని తెలిసింది. గ‌త రెండున్న‌రేళ్లుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న బొత్స ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో సుదీర్ఘ కాలం త‌న మ‌నుగడ కొన‌సాగ‌ద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకే తాను త‌ప్పుకుని త‌న త‌న‌యుడు బొత్స సందీప్‌ను రంగంలోకి దించాల‌ని భావిస్తున్నార‌ని తెలిసింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు తిరుగులేదు. గతంలో కాంగ్రెస్‌లో ఇప్పుడు వైసీపీలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే హుందాగా ప‌క్క‌కు త‌ప్పుకుని త‌న కొడుకు రాజ‌కీయ జీవితాన్ని నిర్మించాల‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సందీప్‌ను చీపురుప‌ల్లి నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ని అందుకోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు వైద్య వృత్తిని అభ్య‌సించిన‌ప్ప‌టికీ సందీప్ కూడా రాజ‌కీయాల‌పై ఆస‌క్తితో ఉన్నారు. ఇప్ప‌టికే సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ హెల్త్‌, విద్య‌, ఉపాధి కోసం ప్ర‌త్యేక సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ధీర పేరుతో ఓ సంస్థ‌ను నెల‌కొల్పి కొవిడ్ స‌మ‌యంలో జిల్లావ్యాప్తంగా సేవ‌లు అందించారు. బొత్స యువ‌సేన‌ను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.