డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. డీజీపీ ఆకస్మిక బదిలీకి కారణాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 3న పీఆర్సీ కోసం చేపట్టిన ఉద్యోగుల ర్యాలీ విజయవంతం వల్లే చేశారా.. లేక ఉద్యోగులను భయపెట్టేందుకు బదిలీ చేశారా అని నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీతో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘటన గుర్తొస్తోందన్నారు. గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌కమిషనర్‌గానూ రాజేంద్రనాథ్‌రెడ్డి పనిచేశారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతమ్ సవాంగ్‌ను సర్కార్ ఆదేశించింది. 2023 జులై వరకు సవాంగ్‌కు పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
దీనిపైనే పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఓక లేఖ రాశారు. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారు. ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించింది. అధికా రులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి. లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది“ అని పవన్ పేర్కొన్నారు.
అంతేకాదు, “ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ గారి బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుంది.“ అని పవన్ తన లేఖలో పేర్కొనడం గమనార్హం. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.