హిజాబ్ లేక‌పోతే రేప్ చేస్తారు… ఎమ్మెల్యే క‌ల‌క‌లం

కర్ణాట‌క‌లో మొద‌లైన హిజాబ్ ర‌చ్చ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మహిళలు తమ మఖానికి ముసుగు వేసుకోకపోవడం వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అందుకే లైంగిక దాడి కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో ఈ హిజాబ్ వివాదం మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోందని అంటున్నారు.

హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారమని కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. హిజాబ్ ధరించకపోతే మహిళలు అత్యాచారాలకు గురవుతారని అన్నారు. ‘హిజాబ్ ఎందుకంటే, అమ్మాయిలు పెద్దయ్యాక, వారి ముఖ అందాన్ని దాచడానికి. మహిళల అందం బయటకు కనిపించకూడదు.

ప్రపంచంలోనే అత్యధిక అత్యాచార కేసులు దేశంలో నమోదవుతున్నాయని నేను భావిస్తున్నాను. మహిళలు తమ ముఖాలకు ముసుగు వేయకపోవడమే దీనికి కారణం’ అని జమీర్ అహ్మద్ అన్నారు. ఇదిలాఉండ‌గా, విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్‌ ధరించడంపై అనవసర చర్చ జరుగుతోందని కర్ణాటకలోని రామకృష్ణ ఆశ్రమానికి చెందిన యోగి భవేశానంద్‌ చెప్పారు. హిజాబ్‌ వివాదం సమాజానికి మంచిది కాదన్నా రు. హిజాబ్‌పై ప్రస్తుతం జరుగుతున్న చర్చ, రాద్ధాంతాన్ని చూస్తుంటే మనసుకు బాధకలుగుతున్నదని వెల్లడించారు.

హిజాబ్‌ ధరించడం తమ హక్కు అని, విద్యా సంస్థల్లో కూడా అనుమతించాలని కోరుతూ ముస్లిం యువతులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దేవాదత్‌ కామత్‌ను కొందరు టార్గెట్‌ చేసుకున్నారని విమర్శించారు. దేవాదత్‌ ఓ న్యాయవాది అని, తన క్ల‌యింట్‌కు న్యాయం జరిగేలా చూడటం ఆయన విధి అని భవేశానంద్‌ చెప్పారు. ఆయన హిందూ వ్యతిరేకి అన్నట్టు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం తగదని సూచించారు. ఈ వివాదంలోకి ఓ న్యాయవాదిని కూడా లాగడం చూస్తుంటే బాధేస్తున్నదని వెల్లడించారు