తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ లేనంతంగా వేడెక్కాయి. ఏడున్నరేళ్ల పాలనలో ఎప్పుడూ లేనంతంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవడంతో అధికార టీఆర్ఎస్‌కు పరీక్ష తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా బీజేపీని అడ్డుకుని కాంగ్రెస్‌నూ దెబ్బ తీసేందుకు కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశారు. అందుకే ఎప్పుడూ లేనిది కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకు బీజేపీ కూడా దీటుగానే స్పందిస్తోంది. ఇప్పుడిక పార్లమెంట్‌లో ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని ప్రధాని మోడీ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.
ప్రధాని మోడీ వ్యాఖ్యలతో నిప్పు పుట్టిందని.. ఇప్పుడు మిగతా పార్టీలు చలి కాచుకుంటున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గకుండా తమ పట్టు చూపించేందుకు ఆరాటపడుతున్నాయి. మోడీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ర్యాలీలు, నిరసనలతో రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హడావుడి చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేసేలా ప్రధాని మాట్లాడడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేస్తూ ఇప్పుడిలా మాట్లాడడం ఏమిటనీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. ఆ పార్టీ కారణంగానే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైందని దుయ్యబట్టారు.
మరోవైపు కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్, బీజేపీల పాత్ర లేదని వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ఏర్పాటు తీరును ప్రధాని తప్పుపట్టడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మోడీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇక మోడీ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర నేతలు మునిగిపోయారు.
కాంగ్రెస్‌పై ప్రధాని మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ సభలోనే లేరని, ఆయనకు రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని విమర్శించారు. ఇలా ఎవరికి వాళ్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాటల యుద్ధం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.