మోడీ కామెంట్ల‌కు హ‌రీష్‌ రావు కౌంట‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న స‌రైన రీతిలో జ‌ర‌గ‌లేద‌ని ప్రధాని మోడీ పార్ల‌మెంటులో చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్ర‌ధాని కామెంట్ల‌పై తెలంగాణ‌లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ విరుచుకుప‌డుతోంది. ప్ర‌ధాని కామెంట్ల‌పై టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్‌ రావు త‌క్ష‌ణ‌మే స్పందించారు. రాజ్యసభలో ప్ర‌ధాని మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని మండిప‌డ్డారు.

తెలంగాణపై మోడీ మళ్లీ అక్కసు వెళ్లగక్కారని మండిప‌డిన హ‌రీష్‌ రావు తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారు అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడితే ప్రధాని మోడీ ఎందుకో దుఃఖ పడుతున్నాడని హ‌రీష్‌ రావు వ్యాఖ్యానించారు. “ఆంధ్రప్ర‌దేశ్ – తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట.

1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారు. సుఖ ప్రసవం చేస్తామంటే మేం వద్దు అన్నమా? ఎందుకు మాట ఇచ్చి తప్పారు?“ అని హరీష్‌ రావు మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రికి ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారని మండిప‌డిన హ‌రీశ్ రావు కనీసం మాట చెప్పకుండా చేసి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిప‌డ్డారు.

తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా ప్ర‌ధాని అక్కసు వెళ్లగక్కుతాడు.. ద్వేషం చిమ్ముతాడని హ‌రీష్‌ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ బాగుపడుతుంది… కానీ మోడీకి నచ్చడం లేదు అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో విభజన చట్టంలో చెప్పినవి అమలు చేయరు కానీ విభ‌జ‌న‌ను మాత్రం త‌ప్పుప‌డ‌తారు అని హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతారని ఆయన దుయ్యబట్టారు.