తన రాజీనామాపై నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు, రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ప్రత్యర్ధులపై సెటైర్లు వేశారు. తానంటే భయపడుతున్న వారే తనపై ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, మద్దతుదారుగా తాను పార్టీలో ఉంటానని, బతికున్నంత వరకు మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. తనకు ఎంఎల్ఏగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటు జనాలనే ప్రశ్నించారు. తన ప్రత్యర్థులు కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపోయారు. తాను ఇసుకను దొంగతనంగా అమ్ముకుంటున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తనకు బాగా తెలుసన్నారు.
ఇసుకనో మరొకటో అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిపించిన వైసీపీని వదిలి పెట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ కష్టాల్లో ఉన్నపుడు తాను అండగా నిలిచిన విషయం అందరికీ తెలుసన్నారు. అందరూ పల్లె ప్రాంతాల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళిపోతుంటే తాను చెన్నై, హైదరాబాద్ మహానగరాల నుండి నగిరికి వచ్చిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నగిరిలో తాను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి తాను ఎప్పటికీ నగిరిలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
పార్టీ మార్పు, ఎంఎల్ఏగా రాజీనామా విషయాలపై రోజా క్లారిటీ ఇవ్వటం వరకు బాగానే ఉంది కానీ తన నోటిదురుసు మాటేమిటి అనే చర్చ ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు. రోజాకు దూకుడు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దూకుడు కారణంగానే ప్రత్యర్ధి పార్టీలతో పాటు పార్టీలో కూడా శతృవులు పెరిగిపోతున్నారు. నియోజకవర్గంలో ఎటుచూసినా ప్రత్యర్ధుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుండే జనాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.