కేసీఆర్ సై అంటున్నారు.. మ‌రి జ‌గ‌న్‌?

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మ‌ర శంఖం పూరించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయ‌మే చేస్తుంద‌ని ప‌దునైన విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసి త‌మ అసంతృప్తిని పార్ల‌మెంట్ సాక్షిగా వ్య‌క్త‌ప‌ర‌చాల‌ని.. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని టీఆర్ఎస్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు త‌మ పార్టీ ఎంపీల‌కు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వ్య‌వ‌హ‌రంచాల్సిన వైఖ‌రిపై మార్గ‌నిర్దేశ‌నం చేశారు. అధినేత ఆదేశాల‌కు అనుగుణంగానే రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బ‌హిష్క‌రించారు. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్‌.. కేంద్రంలోని ఆ పార్టీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఏదేతైనేం ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా ప్ర‌శ్నించని ఆయ‌న‌.. ఇప్పుడు గొంతెత్తార‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై పెద్ద రాద్దాంతం చేసిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ‌కు రావాల్సిన వాటి గురించి, కేంద్రం చిన్న చూపుపై ప్ర‌శ్నించ‌డాన్ని ఉద్ధృతం చేసింది. అందుకు ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వేదిక‌గా ఎంచుకుంది.

ఓ వైపు తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రంలోని బీజేపీపై పోరాడుతుంటే.. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార వైసీపీ ప్ర‌భుత్వం కిమ్మ‌న‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు, విభ‌జ‌న చ‌ట్టం హామీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి ఎన్నో అంశాల్లో కేంద్రం నుంచి మొండిచెయ్యే ఎదుర‌వుతోంది. కానీ 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

లోక్‌స‌భ‌లో కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఏదో చేశామా? లేదా? అన్న‌ట్లు నిర‌స‌న‌లు చేపడుతున్నారే త‌ప్ప‌.. వాటిల్లో తీవ్ర‌త లేద‌న్న విష‌యాన్ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణ‌యాల‌కు వైసీపీ మ‌ద్ద‌తు తెలుపుతూనే ఉంది. కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడ‌గ‌డంలో మాత్రం వెన‌క‌బ‌డుతోంద‌నే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ ఇక బీజేపీ క‌లిసి సాగేదే లేద‌న్న‌ట్లు సంకేతాలిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇక‌నైనా జ‌గ‌న్.. మోడీపై యుద్ధానికి దిగుతారేమో చూడాలి.