ఉష‌.. ఉలుకూప‌లుకు లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భావంతో తొలిసారిగా వైసీపీ నుంచి పోటీ చేసిన నాయ‌కులు గెలిచారు. అంత‌వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌కు వాళ్ల గురించి పెద్ద‌గా తెలీక‌పోయినా జ‌గ‌న్ ఇమేజ్‌తో విజ‌యాన్ని అందుకున్నారు. మ‌రోవైపు టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న క‌ల్యాణ‌దుర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ‌డం అదే తొలిసారి.

విభేదాలు..

ఎన్నిక‌ల్లో గెలిచ‌న త‌ర్వాత ఉషశ్రీ పార్టీ నాయ‌కుల‌ను క‌లుపుకొని పోవ‌డం కాకుండా.. ఆధిప‌త్యం కోసం పోరాడుతున్న‌రానే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో విభేదాలు ఎక్కువ‌య్యాయ‌నే టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం త‌ర్వాత క‌ల్యాణ‌దుర్గంలో జ‌రిగిన తొమ్మిది ఎన్నిక‌ల్లో అయిదు సార్లు ఆ పార్టీనే గెలిచింది. ఒక‌సారి దాని మిత్ర‌ప‌క్షం విజ‌యం సాధించింది. 2014లోనూ టీడీపీనే నెగ్గింది. కానీ 2019లో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఏ మాత్రం అవ‌కాశం ఇచ్చినా అక్క‌డ టీడీపీ బ‌లంగా పుంజుకునే ప్ర‌మాదం ఉంది.

అన్నీ పీఏనే..
కానీ క‌ల్యాణ‌దుర్గం నుంచి గెలిచిన ఉష‌శ్రీ వైఖ‌రి మాత్రం మొద‌టి నుంచి వివాద‌స్ప‌దంగానే ఉంద‌న్న అభిప్రాయాలున్నాయి. ఆమె పార్టీ క్యాడ‌ర్‌కు అందుబాటులో ఉండ‌ర‌ని ఆమె నియ‌మించిన పీఏనే అన్ని ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. ఆమె మాత్రం ఎక్కువ‌గా బెంగ‌ళూరులోనే ఉంటున్నార‌ని తెలిసింది. ఆమెను క‌ల‌వ‌డం కూడా సొంత పార్టీ నేత‌ల‌కు క‌ష్టంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఓ సారి నియోజ‌క‌వ‌ర్గానికి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతుంటార‌ని చెబుతున్నారు. రెండోసారి గెల‌వాల‌న్న ఆశ ఆమెకు లేన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కౌన్సిల‌ర్లు ఆమెపై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. త‌మ‌పై ఎమ్మెల్యే క‌క్ష సాధిస్తున్నార‌ని క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి వాళ్లు ఫిర్యాదు చేశారు. దీనిపై అధిష్ఠానం కూడా సీరియస్‌గానే ఉంద‌ని స‌మాచారం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇవ్వ‌డం అనుమానంగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది.