ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆదరణతో జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ సంచలనంగా మారారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమల్లో జగన్ మునిగిపోయారు. మూడేళ్లగా పాలనపైనే ప్రత్యేక ధ్యాస పెట్టారు. నవరత్నాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి ఏదో రకంగా డబ్బులు జమ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అప్పులతో కుదేలవుతున్న జగన్ మాత్రం ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ మాత్రం తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. పాలన పరంగా ప్రభుత్వం పరంగా ప్రత్యేక ఫోకస్‌తో అడుగులు వేస్తున్నారు. కానీ ఈ మూడేళ్లుగా ఆయన పార్టీపై దృష్టి పెట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల నుంచి పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాల్లో అసలు కార్యవర్గం యాక్టివ్‌గా ఉందా? లేదా? అనే ప్రశ్నలు కలుగుతున్నాయని అంటున్నారు. పార్టీ కార్యవర్గాన్ని ఇంతవరకూ ప్రక్షాళన చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ఏ కార్యవర్గం ఉందో ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
మరోవైపు పార్టీ నేతలైనా ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. జగన్ జిల్లాల పర్యటనలు తప్పించి ఎక్కడా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు లేవనే అంటున్నారు. దీంతో పార్టీని పట్టించుకోలేనంత బిజీగా జగన్ ఉన్నారా అనే ప్రశ్న సొంత నేతల నుంచే వినిపిస్తోంది. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య అసంతృప్తి, విభేదాలు పెరుగుతున్నాయి. దాదాపు వంద నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని సమాచారం. కొంతమంది నాయకులకు ప్రభుత్వ పదవులు లభించడం, మరికొందరికి మొండిచెయ్యి ఎదురవడంతో సహజంగానే అసంతృప్తి తలెత్తుతోంది. వివిధ సందర్భాల్లో నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు.
మూడేళ్ల నుంచి వైసీపీ పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించలేదు. ఇప్పుడిక 26 జిల్లాలు అయ్యాయి. ఈ జిల్లాలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నియమించాల్సి ఉంది. కానీ జగన్ ఈ విషయంపై దృష్టి సారించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిస్థితిపై ఓ సారి సమీక్ష నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పక్కన తెలంగాణలో కేసీఆర్ తన పార్టీపై పూర్తి ఫోకస్ పెట్టిన విషయాన్ని వైసీపీ నేతలు చెబుతూ.. తమ అధినాయకుడు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates