నాగబాబు తెలిసే చేస్తున్నాడా?

Nagabau

తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటూ తానూ ఎదుగుదాం అన్న ఆశతో జనసేన పార్టీలోకి వచ్చాడు నాగబాబు. ఐతే ఈ మధ్య ఆయన వల్ల పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోందన్నది జనసైనికుల ఆవేదన. గాంధీని చంపిన గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యల నుంచి.. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం వరకు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.

పార్టీ విధానాలకు, ఆయన వ్యాఖ్యలకు అంతరం కనిపిస్తోంది. అసలు పార్టీ అధినాయకత్వంతో సంప్రదించే ఆయన వివిధ అంశాలపై స్పందిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గాడ్సే వ్యాఖ్యల విషయంలో పార్టీకి సంబంధం లేదని పవన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో పవన్ ఏమన్నాడో అందరికీ తెలిసిందే
ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిందేమో అన్న సందేహాలు వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ ఇచ్చాడు.

ఐతే అంతకంటే ముందు నాగబాబు అచ్చెన్నాయుడి అరెస్టు పట్ల సంతోషం పట్టలేని విధంగా ట్వీట్ వేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జనసైనికుల అరెస్టుల విషయాన్ని గుర్తు చేస్తూ తెలుగు దేశం వాళ్లకు తగిన శాస్తి జరుగుతోందన్నట్లుగా మాట్లాడాడు. దీని కింద జనసేనకే చెందిన ఓ వ్యక్తి.. పార్టీ అధ్యక్షుడి ప్రెస్ నోట్‌ను షేర్ చేస్తూ.. మీరసలు పార్టీ అధినాయకత్వంతో మాట్లాడే ఇలా ట్వీట్లు చేస్తున్నారా అని ప్రశ్నించాడు.

కొన్ని రోజుల కిందటే టీడీపీని సపోర్ట్ చేసే మీడియాను విమర్శిస్తూ.. వీళ్లకు జగన్మోహన్ రెడ్డే కరెక్ట్ అంటూ కామెంట్ చేశారు నాగబాబు. సందర్భం ఏదైనా సరే ప్రత్యర్థి గురించి ఇలాంటి పాజిటివ్ కామెంట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ జనసైనికులే నాగబాబును విమర్శించారప్పుడు. ఇలా టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో ఆయన వైసీపీ మద్దతుదారులాగా మారిపోతున్నారని.. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా జనసేనకు ఇబ్బందికరంగా మారుతున్నాయని.. ఇవన్నీ నాగబాబు తెలిసే చేస్తున్నారో లేదో తెలియట్లేదని విశ్లేషకులు అంటున్నారు.