పార్టీల్లో కోవర్టుల గోల ఎక్కువైపోతున్నట్లుంది. జనసేనలో కూడా కోవర్టులున్నారంటు స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాకపోతే తమ పార్టీలో కోవర్టులున్నారంటు డైరెక్టుగా పవన్ చెప్పలేదు. అయితే తమ వ్యక్తిగత ఎదుగుదలకు తన పేరును వాడుకుని చివరి మూడురోజుల్లో టీడీపీ, వైసీపీలోకి వెళ్ళిపోయే వాళ్ళున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
ఆ మధ్య మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు మాట్లాడుతు పార్టీలో కోవర్టులున్నట్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీలోని కోవర్టులను తొందరలోనే ఏరిపారేస్తానంటు పార్టీ నేతల ముందే వార్నింగ్ ఇచ్చారు. అంటే అప్పట్లో చంద్రబాబు చెప్పిన కోవర్టులంటే వైసీపీ లబ్దికోసం టీడీపీలో పనిచేస్తున్న నేతలన్నమాట. కానీ ఇపుడు పవన్ చెప్పిన కోవర్టులు ఎవరంటే టీడీపీ, వైసీపీ లబ్దికోసం పనిచేస్తున్నారట.
అంటే కోవర్టుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలకు పవన్ చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసముంది. చంద్రబాబు కేవలం వైసీపీని ఉద్దేశించే చెప్పారు. కానీ ఇఫుడు పవన్ మాత్రం టీడీపీ, వైసీపీ రెండింటిని ఉద్దేశించి ఆరోపించారు. సరే ఎవరెలా చెప్పినా రెండుపార్టీల్లోను కోవర్టులున్నారనే గోల మాత్రం పెరిగిపోతోంది. ఇక్కడే ఇద్దరు అధినేతలపైనా అనుమానాలు పెరిగిపోతున్నాయి. టీడీపీలో ఉన్న కోవర్టులెవరో తనకు తెలుసని చంద్రబాబున్నారు.
అలాగే జనసేనలోని కోవర్టులెవరో తనకు తెలుసని పవన్ కూడా చెబుతున్నారు. పైగా అలాంటివారిని పార్టీ కమిటీలకు దూరంగా ఉంచమని బహిరంగంగానే చెప్పారు. తమ పార్టీల్లో ఉంటు ప్రత్యర్ధి పార్టీల లబ్దికోసం పనిచేస్తున్న కోవర్టు నేతలెవరో తెలిసినపుడు ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ? అధినేతలిద్దరికీ కోవర్టులెవరో తెలిసినపుడు పార్టీల నుండి బయటకు పంపేయచ్చు కదా?
షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళుంది. జమిలి ఎన్నికలని, ముందస్తు ఎన్నికలని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదెప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. అలాంటపుడు పార్టీలను ఇప్పుడే ప్రక్షాళన చేసేస్తే ఎన్నికలనాటికి వీళ్ళకే మంచిదికదా. ఇపుడేగనుక కోవర్టులను ఏరేయకపోతే ముందు ముందు తమకే నష్టమని చంద్రబాబు, పవన్ కు తెలీదా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates