జ‌గ‌న్‌కు సొంత జిల్లాలోనే వ్య‌తిరేక‌త‌

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల అంశంపై భారీ ఎత్తున‌ విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై సీఎం జ‌గ‌న్ సొంత పార్టీ వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ వైఖరిని రాజంపేట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రి రవి తప్పుబట్టారు. ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. ఆయ‌న అన్నారు. రాయ‌చోటికి.. అన్న‌మ‌య్య జిల్లాకు సంబంధం ఎలా కుదురుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై.. రాజంపేట ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట ప్రజల అభిప్రాయం తీసుకోకుండా రాయచోటి జిల్లాలో కలపటంపై రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి మండిపడ్డారు. అన్నమయ్య పేరును ఆయన పుట్టినచోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాజంపేట.. కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కోడూర్, రాజంపేటలో వైసీపీ ఓడిపోతుందని హెచ్చరించారు.

“అన్నమయ్య పేరును ఆయన పుట్టిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టారు. రాయచోటిని మదనపల్లిలో కలుపుకొని మరో జిల్లా ఏర్పాటు చేసుకోండి. రాజంపేట వాసులను అనాథల్లా రాయచోటిలో కలిపారు. ఇలా చేస్తే మేము ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం పాలవుతుంది. నా వైస్‌ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తాను. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించాలి. లేదంటే రాజపేటను జిల్లా కేంద్రం చేయాలి” అని అన్నారు.

ఇక‌, ఇత‌ర జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హాలో నేత‌లు మండి ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన జిల్లా కేంద్రాలు కూడా అస‌మంజ‌సంగా ఉంద‌ని.. ఎలాంటి అధ్య‌య‌నం చేయ‌కుండానే.. ఎవ‌రి అభిప్రాయ‌మూ తీసుకోకుండానే ఇలా చేయ‌డం ఏంట‌ని.. ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం జిల్లాల ఏర్పాటుపై సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా సంప్ర‌దించ‌రా.. అని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఒక‌రు ప్ర‌శ్నించారు. ఇక‌.. మ‌న్యం జిల్లాను, అల్లూరి జిల్లాను వేర్వేరుగా ఏర్పాటు చేయ‌డ‌మేంట‌ని.. మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా.. మొత్తంగా.. అన్ని జిల్లాల్లోనూ సొంత పార్టీ నేత‌లే రోడ్డున ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.