సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెగ బాధ పడిపోతున్నారు. ఇంతకీ ఈయన బాధేమిటయ్యా అంటే పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పినందుకు. ఉద్యోగులు ఎవరు రాజకీయపార్టీల ఉచ్చులో పడవద్దని, ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగసంఘాల నేతలు బహిరంగంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేశారు.
ఆ అప్పీలునే నారాయణ తప్పు పడుతున్నారు. ఉద్యోగుల సమ్మెలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పడం ఏమిటంటు బాధపడిపోయారు. రాజకీయ పార్టీలేమన్నా అంటరాని పార్టీలా అంటు ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలతో అంటకాగాల్సిన అవసరం లేదని అయితే ఇదే సమయంలో రాజకీయ పార్టీలను ఉద్యోగ సంఘాలు దూరంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ఉద్యోగుల ఉద్యమానికి భేషరతుగా మద్దతు ప్రకటించిన పార్టీలను దూరంగా పెట్టాలని పిలుపునివ్వటం ఏమిటంటూ నారాయణ నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు సమస్య ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మొదలైంది. కాబట్టి తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు అనుకున్నారు. కాబట్టే రాజకీయ పార్టీలకు అనుమతి లేదని స్పష్టంగా చెప్పేశారు.
ఏ అంశంలో అయినా రాజకీయ పార్టీలు ఎంటర్ అయితే విషయం వెంటనే తప్పుదోవ పడుతుందన్న విషయం అందరికీ తెలుసు. ఇపుడు ఉద్యోగుల ఆందోళనలకు రాజకీయ రంగులు తోడైతే సమస్య ఇంకా పెద్దతైపోతుందని ఉద్యోగ నేతలు అనుకున్నారు. అందుకనే తమ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదన్నారు. ఇంతోటి దానికి నారాయణ బాధపడాల్సిన అవసరమే లేదు.
కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకున్న సామెత లాగ పార్టీల మద్దతు తమకు వద్దని ఉద్యోగ నేతలు చెప్పేసినపుడు దానికి బాధపడాల్సిన అవసరం నారాయణకు ఏముంది ? వామపక్షాల జోక్యంతో పరిష్కారమైన సమస్య ఏదైనా ఉందేమో నారాయణ చూపించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. కాబట్టి ఉద్యోగుల ఆందోళనలకు నారాయణ దూరంగా ఉంటేనే మంచిదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates