ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ పెద్దలు గంపెడాశతో ఉన్న సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని వారి ఆశలపై నీళ్లు చల్లారు. చిరంజీవితో ముఖ్యమంత్రి జగన్ జరిపినవి సంప్రదింపులు కావని, కుశలప్రశ్నలు(చిట్ చాట్) మాత్రమేనని తేల్చేచారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం విస్మయానికి గురి చేసింది. వాస్తవానికి ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య అగాధాన్ని పెంచిన విషయం తెలిసిందే. సినీ నిర్మాతలతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మతో మంత్రి పేర్ని నాని సంప్రదింపులు జరిపిపారు.
ఈ క్రమంలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ తాడేపల్లికి ఆహ్వానించారు. చిరంజీవి, జగన్ భేటీతో టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. జగన్‌తో సమావేశం తర్వాత చిరంజీవి కూడా అందరికీ శుభవార్త తెలిపారు. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు సమగ్రంగా వివరించానని చెప్పారు. జగన్ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చిందన్నారు.
అయితే.. తాజాగా మంత్రి పేర్ని రియాక్ట్ అయ్యారు. చిరంజీవితో సీఎం జగన్ ఎలాంటి చర్చలూ జరపలేదన్నారు. కేవలం ఒకరి కుటుంబాల గురించి ఒకరు మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే.. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని కోర్టుల్లో ఉన్నాయని చెప్పారు.
ఇక, మంత్రి కొడాలి నాని క్యాసినో గురించి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు గుడివాడకు ఎందుకు వెళ్లారు..? అని ప్రశ్నించారు. క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణ చేయడానికి వారెవ్వరని నిలదీశారు. గుడివాడలో నిజంగా తప్పు జరిగితే సీఎం జగన్ తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు. తప్పుచేస్తే ప్రభుత్వం జడ్జీలను కూడా వదలదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు పెట్టిన సినిమా వాళ్లు తప్పుచేసినా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్నినాని ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates