ఇపుడిదే అంశం జాతీయ రాజకీయాల్లో చాలా మందికి అర్థం కావడం లేదు. పైకేమో నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిందే అంటు భీకరమైన ప్రకటనలు చేస్తుంటారు. కానీ చేసే పనులేమో మోడీకి అనుకూలంగానే కనబడుతున్నాయి. దాంతో వీరిద్దరి వైఖరి ఏమిటో మిగిలిన పార్టీల అధినేతలకు అర్థం కావటం లేదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా ? వాళ్ళే దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్లుగా పాపులరైన మమతాబెనర్జీ, మాయావతి.
వీళ్ళద్దరు ఘనమైన పోరాటాలే చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. మమత మూడోసారి ముఖ్యమంత్రి అయితే మాయావతి ప్రస్తుతం ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. ఐదు రాష్ట్రాలకు జరగబోతున్న ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ తో పాటు గోవా కూడా ఉన్నది. వీటిల్లో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే చిన్న రాష్ట్రం గోవా. ఈ రెండు రాష్ట్రాల్లో మమత, మాయ అనుసరిస్తున్న ఎత్తుగడలను చూసిన తర్వాత మిగిలిన వాళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఎందుకంటే యూపీలో మాయావతి అసలు చప్పుడే చేయటం లేదు. చాలాకాలంగా అసలు మోడీ గురించే మాట్లాడటం లేదు. పైగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎస్సీల్లో మంచిపట్టున్న బీఎస్పీ అధినేత మాయావతి ఇప్పటివరకు సమావేశాలు పెట్టటేదు, బహిరంగసభలు నిర్వహించలేదు. ర్యాలీలు, రోడ్డషోలు కూడా ఎక్కడా కనబడటం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒకవైపు 24 గంటలూ జనాల్లోనే కనబడుతుంటే మరి మాయావతి మాత్రం ఎవరికీ కనబడటం లేదు.
ఇక్కడే మాయ వైఖరితో అనుమానం వచ్చేస్తోంది. తెరవెనక మోడీతో మాయకు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దళితుల ఓట్లు బీజేపీకి మళ్ళించటానికే మాయ ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీనికి మాయ వైఖరి కూడా ఊతమిస్తోంది. సరే ఇక మమత విషయం చూస్తే గోవాలో అధికారం మాదే అని నానా గోల చేస్తున్నారు. రాష్ట్రం ఎంత చిన్నదైనా రాష్ట్రం రాష్ట్రమే కదా.
మమత చర్యల వల్ల కాంగ్రెస్ కు బాగా ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉన్నా మమత చర్యలతో వీకైపోతోంది. మోడీని ఎలాగైనా గద్దె దింపటమే లక్ష్యమని మమత చెబుతున్నదే నిజమైతే అసలు గోవాలో పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ పోటీ చేయాలని అనుకున్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఒంటిరిగా పోటీచేసిన అధికారంలోకి వచ్చేంత సీన్ తృణమూల్ కు లేదు. ఈ విషయం తెలిసినా మమత అభ్యర్ధులను పెడుతున్నారంటే కేవలం ఓట్లు చీల్చటానికే అని అర్ధమవుతోంది. ఓట్లు చీలితే లాభపడేది మోడీనే అన్న విషయం మమతకు తెలీదా ? ఇలాంటి వైఖరుల వల్లే ఇద్దరిపైనా అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates