వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఎంపీ సవాలు విసిరారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రెండు నెలలు వెయిట్ చేస్తే ఎంపీ రఘురామ పై అనర్హత వేటు పడుతుందో లేదో తెలుస్తుందన్నారు. రఘురామకు ధైర్యముంటే తన రాజీనామాను రెండు నెలలు వాయిదా వేసుకోవాలని సవాలు విసిరారు. తిరుగుబాటు ఎంపీపై తప్పకుండా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాధారణంగా ఎవరిపైనా అనర్హత వేటు వేయరన్నారు. ఈ విషయం తెలిసే రఘురామ రాజీనామా డ్రామా మొదలుపెట్టినట్లు ఎద్దేవా చేశారు. రఘురామ పరిస్థితి సినిమాల్లో కమెడియన్ లా అయిపోయందన్నారు. తనపై అనర్హత వేటుపడటం ఖాయమని అర్ధమైపోయిన తర్వాతే రాజీనామా నాటకం మొదలుపెట్టినట్లు భరత్ చెప్పారు. అనర్హత వేటు వేయించటంలో తమ పార్టీకి ఎంపీ డెడ్ లైన్ పెట్టడంలో అర్ధమే లేదన్నారు.
పార్లమెంటులో మరోసారి రఘురామ అడుగుపెట్టే అవకాశమే లేదని ధీమాగా చెప్పారు. కమెడియన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పడం గమనార్హం. మొత్తానికి రఘురామ సవాలుకు రాజమండ్రి ఎంపీ స్పందించటం బాగానే ఉంది. అనర్హత వేటు విషయంలో తిరుగుబాటు ఎంపీ సవాలు కరెక్టో లేకపోతే తాజాగా భరత్ చెప్పింది కరెక్టో అర్ధం కావటం లేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, ఏపీలో ఒక ఎంపీపై అనర్హత వేటు వేయటానికి సంబంధం ఏమిటో భరత్ చెప్పలేదు. ఎంపీపై అనర్హత వేటు వేయాల్సింది లోక్ సభ స్పీకరే కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ కాదు. ఎంపీపై ఇపుడు అనర్హత వేటు వేస్తే ఎన్నికల కమీషన్ కే మంచిది. ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి నరసాపురంలో కూడా ఎన్నికలు నిర్వహించేస్తుంది. లేకపోతే తర్వాతెపుడో అనర్హత వేటు వేస్తే మళ్ళీ నరసాపురంలో ప్రత్యేకంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సుంటుంది.
సాధారణ ఎన్నికలకు గడువు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఉపఎన్నికలు నిర్వహించదు. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుంది. కాబట్టి తిరుగుబాటు ఎంపీ ఇపుడు రాజీనామా చేసినా లేదా రెండు నెలల తర్వాత అనర్హత వేటు వేసినా ఉపఎన్నికలైతే తప్పవు. కాబట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అనర్హత వేటు విషయంలో భరత్ మాటలు అంతగా మ్చాచ్ కావటం లేదు. సరే తిరుగుబాటు ఎంపీ చెప్పినట్లు ఫిబ్రవరి 5 వరకు వెయిట్ చేస్తే ఏమవుతుంది ? లేదా భరత్ చెప్పినట్లు రెండు నెలలు ఆగితే ఏమవుతుంది అనేది చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates