అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. గతంలో ఈ ఫ్యామిలీకి పెనుకొండ అడ్డా. అక్కడ నుంచి రవితో పాటు ఆ తర్వాత సునీత కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో సునీత పెనుకొండను వదిలేసి రాఫ్తాడుకు మారారు. రాఫ్తాడులో వరుసగా రెండుసార్లు గెలిచిన సునీత గత ఎన్నికల్లో తన కుమారుడు శ్రీరామ్ కోసం తన సీటు త్యాగం చేశారు. అయితే తొలిసారి భారీ అంచనాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఘోరంగా ఓడిపోయారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో శ్రీరామ్‌ను ఓడించారు. అయితే ఆ తర్వాత ధర్మవరంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిపోవడంతో ధర్మవరం టీడీపీ అనాథగా మారింది. వెంటనే అక్కడ పర్యటించిన చంద్రబాబు తాను ధర్మవరం, రాఫ్తాడు రెండు నియోజకవర్గాలకు పరిటాల ఫ్యామిలీకే ఇస్తున్నానని.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ? వాళ్లే తేల్చుకోవాలని చెప్పారు.
అయితే కొద్ది రోజులుగా శ్రీరామ్ ధర్మవరంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ రోజు తన తల్లి సునీతతో కలిసి బత్తలపల్లి మండలంలో పర్యటించిన సునీత ధర్మవరం నుంచి వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని.. ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక సునీత మాత్రం రాఫ్తాడు నుంచే పోటీ చేయడం ఖాయమైంది. అసలు ధర్మవరంలో టీడీపీ పునాదులు పటిష్టపరిచింది పరిటాల ఫ్యామిలీయే. ఇక్కడ 2004లోనే రవి వల్లే టీడీపీ నుంచి పోటీ చేసిన జయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత రవి మరణాంతరం ఇక్కడ టీడీపీ చెల్లా చెదురు అయ్యింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సూరి కూడా పార్టీ మారిపోవడంతో ఇప్పుడు మళ్లీ టీడీపీ డీలా పడింది. ఇక ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ అక్కడ ఎంట్రీతో ధర్మవరం టీడీపీలో కొత్త జోష్ వచ్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అటు టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తే ధర్మవరం పోరు ఆసక్తిగా ఉంటుందనడంలో డౌట్ లేదు.