ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఎన్నికలు ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్.. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాలకు విరామం.. ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణం. కానీ ఇప్పుడు ఆయన మరో కొత్త పంథాలో సాగబోతున్నారని సమాచారం. ఒకే సారి రెండు పడవల ప్రయాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను దూరం పెట్టకుండా ఒకేసారి రెండు రంగాల్లోనూ ముందుకు సాగుతారని తెలుస్తోంది.
అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్. జనసేన పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్.. అప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో ఏకంగా సినిమాలు ఆపేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు వరుస షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. దీంతో పవన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఆ విషయంలో పవన్ పూర్తి క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
2023 నాటికి పవన్ సినిమా షూటింగ్‌లు పూర్తి చేసి ఏడాది పాటు వచ్చే ఎన్నికల కోసం పనిచేస్తారనే ప్రచారం సాగింది. కానీ పవన్ మాత్రం మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయడంతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలు నిర్మించే బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది మొత్తం సినిమాలు చేసి ఆ తర్వాత పవన్ నిర్మాతగా మారతారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీంతో ఓ వైపు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పవన్ బ్యానర్, సినిమాలు నడుస్తూనే ఉంటాయన్నమాట. అందు కోసం పవన్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. గతంలో లాగా కాకుండా ఇప్పుడు రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పూర్తి సమయం రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఓ వైపు నటించడంతో పాటు నిర్మాతగానూ డబ్బులు వెనకేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని టాక్.