చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ వైజాగ్ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజకీయం ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం పాటు ఎక్కడున్నారో కూడా తెలీని గంటా హఠాత్తుగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా వైసీపీ సీనియర్ నేతలతో హాజరైన గంటా వాళ్ళతో వేదికను పంచుకోవటమే కాకుండా సుదీర్ఘంగా మంతనాలు జరపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గంటా మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
2019లో టీడీపీ తరఫున విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలిచారు. వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావటంతో గంటా టీడీపీకి దూరమైపోయారు. అధికారం లేకుండా గంటా ఉండలేరనే ప్రచారం దాంతో నిజమని నమ్మేట్లుగా ఉంది. తొందరలోనే వైసీపీలో చేరిపోతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నా ఎందుకనో జరగలేదు. ఇదే సమయంలో బీజేపీలోకి వెళిపోతారని కాదు కాదు జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది.
ఈ నేపధ్యంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గంటా రాజీనామా చేశారు. దాంతో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా కనపడటం లేదు. అందుకనే ఆయనపై ఫోకస్ కూడా తగ్గింది. అయితే హఠాత్తుగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ ఎంఎల్ఏ, ఎంఎల్సీలు కరణం ధర్మశ్రీ, త్రిమూర్తులతో వేదికను పంచకోవటమే కాకుండా కాపుల అభ్యున్నతికి కృషి చేస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో కాపులే రాజ్యాధికారాన్ని శాసిస్తారని కూడా అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుల ఐకమత్యానికి తాను కృషి చేస్తానని చెప్పడం గమనార్హం. నిజంగానే గంటాకు అంత ఓపికే ఉంటే ఈపాటికే కాపుల ఐక్యత కోసం కష్టపడేవారు. ఎందుకంటే కాపుల సంక్షేమం కోసం ఇప్పటికే చాలా సమావేశాలు జరిగాయి. వాటిల్లో ఎక్కడా గంటా కనబడలేదు. పైగా ఇపుడు వేదిక పంచుకున్నది కూడా వైసీపీ ప్రజాప్రతినిధులతో. అంటే వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు కాబట్టే గంటా కూడా కార్యక్రమానికి వచ్చారనే ప్రచారం పెరిగిపోతోంది.
అసలు గంటా ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. గెలిచిన పార్టీలో యాక్టివ్ గా లేరు. చేరుదామని అనుకున్న పార్టీలో అవకాశం దొరకటం లేదు. చేరమని ఆహ్వానిస్తున్న పార్టీల్లోకి వెళ్లడానికి ఆసక్తి లేదు. దాంతో గంటా రాజకీయం బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదేమైనా గంట మౌనంగా ఉన్నా, నోరుతెరిచినా సంచలనమే అవుతుందనటానికి ఇదే నిదర్శనం.