విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కదం తొక్కుతున్నారు. ఇప్పటికే విశాఖకు వెళ్లి అక్కడి కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపిన పవన్.. తర్వాత.. ఇటీవల మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేశారు. అయితే.. ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు పవన్ మరో రూపంల ముందుకు వస్తున్నారు. ప్రతి ప్రాతానికి ఈ ఉద్యమం విస్తృతం చేయనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జనసేన తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు.
డిజిటల్ ఉద్యమం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి తమ బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతోనే డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించున్నట్లు స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మద్దతుగా వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంట్లో గళం విప్పాలని పవన్ డిమాండ్ చేశారు. డిజిటల్ క్యాంపెయిన్‌లో రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయాన్ని పార్లమెంట్కు తెలియచేయమని ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరాలన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామన్నారు.
ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. `జై తెలంగాణ` అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదమన్నారు. ఈ నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించిందని పవన్ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసి రావాల్సిన సమయన్నారు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా.. ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే అన్నారు. ప్లాంటు ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా.., ఇప్పటి వరకూ వారు స్పందించలేదన్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని పవన్ మరోసారి డిమాండ్ చేశారు.