నగరిలో ఎంఎల్ఏకి డేంజర్ బెల్స్ మొగుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రోజాకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని నగరి జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి కొందరు కీలక నేతలు హాజరయ్యారు. వీరంతా పార్టీకి వీర విధేయులే అనటంలో సందేహం లేదు. అయితే ఇదే సమయంలో రోజాను పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం కూడా నిజమే. అంటే తాజాగా జరిగిన సమ్మేళనం రోజాకు వ్యతిరేకంగా జరిగిందనే అనుకోవాలి.
నిజానికి రోజాకు ఈ నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె టీడీపీలో ఉండగా ఎంఎల్ఏగా పోటీ టికెట్ ఇచ్చి ఎక్కడినుండో ఒకచోట నుండి పోటీ చేయించాలి కాబట్టి చివరకు నగరి లో పోటీ చేయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ అదే రోజాను చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయించారు. అయితే రెండు చోట్లా రోజా ఓడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె వైసీపీలో చేరి మళ్ళీ నగరి మీదే దృష్టిపెట్టారు. దాంతో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వటంతో 2014లో నగరిలోనే పోటీ చేసిన రోజా గెలిచారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే మొదటిసారి రోజా గెలుపుకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళలో చాలామంది వ్యతిరేకంగా తయారయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి కారణంగా రోజా రెండోసారి కూడా గెలిచారు. అప్పటి నుండి తన వ్యతిరేక వర్గంపై రోజా గట్టిగానే దృష్టిపెట్టారు. అయితే తన వ్యతిరేక వర్గంలోని నేతలపై రోజా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో చాలామందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మద్దతుతో పాటు డైరెక్టుగా జగన్ను కలిసేంత సన్నిహితం కూడా ఉంది.
అనేక కారణాల వల్ల ప్రత్యర్థి వర్గంపై రోజా పై చేయి సాధించలేకపోతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్ధి వర్గంలో కీలకమైన కేజే కుమార్, కేజే శాంతి, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, కొందరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏకమయ్యారు. అంటే రోజా ప్రత్యర్థి వర్గం రోజురోజుకు బలంగా తయారవుతోంది. ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో రోజా గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాస్తవం ఇదైతే రోజా మాత్రం ప్రత్యర్ధి వర్గాన్ని అసలు లెక్కే చేయడం లేదు.
వచ్చే ఎన్నికల్లో రోజా మూడోసారి గెలవాలంటే కచ్చితంగా ప్రత్యర్థి వర్గం మనస్ఫూర్తిగా సహకరించాల్సిందే. లేకపోతే చిత్తుగా ఓడిపోవటం ఖాయమనే అంటున్నారు. ఎందుకంటే ప్రత్యర్ధి వర్గంతో సయోధ్య చేసుకునేందుకు రోజా ప్రయత్నం చేయటం లేదు. ఇదే సమయంలో ప్రత్యర్థి వర్గం కూడా రోజా దగ్గరకు వెళ్ళటం లేదు. ఈ దశలో రోజా ఆశలన్నీ జగన్ పైనే పెట్టుకున్నట్లు కనబడుతోంది. ఎలాగంటే ప్రత్యర్థి వర్గం నేతలు మొత్తం జగన్ ఏమి చెబితే దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే అనేవారే. కాబట్టి ప్రత్యర్ధులకు జగన్ తో చెప్పించి పనిచేయించుకోవాలని రోజా ప్రయత్నిస్తున్నట్లుంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.